ఆ టీవీ చానెళ్లకు మేత వేసేందుకే చిదంబరంని అమర్యాదపూర్వకంగా అరెస్ట్ చేశారు…

cbi arrests congress senior leader chidambaram
Share Icons:

ఢిల్లీ:

 

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.  ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరంను అరెస్ట్‌ చేసేందుకు ఆయన ఇంటికొచ్చిన సీబీఐ, ఈడీ అధికారులను వ్యక్తిగత సిబ్బంది అడ్డుకోవడంతో కాసేపు హైడ్రామా నడిచింది. దాదాపు గంట హైడ్రామా అనంతరం  సీబీఐ అధికారులు చిదంబరంను అరెస్ట్‌ చేశారు. సీబీఐ ఆర్థిక నేర విభాగ జాయింట్‌ డైరెక్టర్‌ ఢిల్లీ పోలీసుల సహకారంతో  చిదంబరాన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం కారులో సీబీఐ ప్రధాన కార్యాలయానికి ఆయన్ను తరలించారు

 

అయితే ఈ అరెస్ట్ పై చిదంబరం తనయుడు కార్తీ స్పందిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించాడు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసినవేళ.. దానిపై జరుగుతున్న చర్చ నుంచి దేశం దృష్టి మరల్చేందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఏవో కొన్ని టీవీ చానెళ్లకు మేత వేసేందుకే ఓ మాజీ కేంద్రమంత్రిని ఇంత అమర్యాదపూర్వకంగా అరెస్ట్ చేశారని అన్నారు.

 

చిదంబరం రెగ్యులర్‌గా సీబీఐ విచారణకు హాజరవుతూనే ఉన్నారని… అలాంటప్పుడు ఆయన్ను ఇలా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చిదంబరం చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు. చిదంబరం అరెస్ట్ నేపథ్యంలో కార్తీ చిదంబరం బుధవారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.  చిదంబరం అరెస్టును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి కచ్చితంగా కక్ష సాధింపు చర్యలేనని ఆరోపిస్తోంది.

Leave a Reply