పోల్ నెం. 24.  కులం కార్డుతో ఓట్లు రాలుతాయా?

Share Icons:

 

 

 

కులవిచక్షణలోని డొల్లతనం గురించి వేమన మాట్లాడుతూ.. 

మాలవానినంటి మరినీట మునిగితే
కాటికేగునపుడు కాల్చు మాల
అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?
విశ్వదాభిరామ వినురవేమ అని  అంటాడు…  

 

[pinpoll id=”59577″]

తిరుపతి, జూలై 30,  భారత దేశం ఎందరో మహోన్నత వ్యక్తుల త్యాగ ఫలం. మన దేశానికి బ్రిటీషువారు పాలకులుగా వచ్చేవరకూ ఈ దేశంలో కుల మతాల చిచ్చు ఇంత రొచ్చు రొచ్చుగా మారలేదు.  అంతకు ముందు మహమ్మదీయుల పాలన ఉన్నా వారు పై స్థాయిలో పనులు జరిపించడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. అందువలన కులం వివాద హేతువు కాలేదు. కానీ గత 300  సంవత్సారలలో భారతీయుల కుల గణన విపరీతంగా పెరిగింది. స్వతంత్య్రం వచ్చిన తరువాత అంతా సమాన హక్కులున్న పౌరులుగా మారినతరువాత ఈ కుల వివక్ష నిర్మూలనకు  గట్టి ప్రయత్నం జరిగి ఉంటే  పరిస్థితి మరో లా ఉండేది. కానీ మనుషులను కేవలం ఓటింగ్ యంత్రాలుగా భావించే రాజకీయాలు ప్రజల మధ్య వివక్షను మరింత పెంచి పోషించడానికి కృషి చేశాయి.  వివిధ ప్రాంతాలు, వర్గాలు, కులాలు, ఉపకులాల మధ్య చిచ్చుపెట్టి, వైషమ్యాలను కల్పించి రాజకీయ లబ్ధిపొందడానికి మన రాజకీయనేతలు తమ వాక్ స్వేచ్ఛను వాడుకున్నారు. రాజ్యాంగం కల్పించిన అనేక పౌర హక్కులు పిచ్చివాని చేతిలో రాయిలాగా దుర్వినియోగమౌతూ.. భారత ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టడానికి ఉపకరించాయి. ఈ విపరీత పరిణామం కొద్దికాలంగా కులాలకొక రాజకీయ పార్టీ ఏర్పడే వరకూ వెళ్లింది. మన కులపోల్లంతా మనకే ఓటేయాల అని నాయకులు నిర్థేశించే వరకు పరిస్థితి విషమించింది.

ఎన్నికల్లో లబ్ది పొంది ఎలాగోలా అధికారం చేజిక్కించుకోవడానికి రాజకీయ నేతలు, పార్టీలు అలవిగాని హామీలనిచ్చే విధానం అలవాటైంది. ఎన్నికలకు ముందు కులాల వారీగా రిజర్వేషన్లు కల్పిస్తామనే మోసపూరిత హామీలను నేతలు ప్రజల ముందుంచుతున్నారు. అలా ఊరించి గంపగుత్తగా ఓట్లు పొందుతున్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ఈ తలకు మించిన హామీల ఊసెత్తడం లేదు. చివరకు ఎవరో ఒక మిత్రుడు ఆశించింది అందక అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ఈ హామీల అమలుకు దీక్షలు చేపట్టడం రివాజుగా మారింది. ఈ కుల వివాదాలు ప్రజలకు ఎంతవరకూ మేలు చేస్తున్నాయి? ఈ రిజర్వేషన్లు రాజకీయంగా వారికి మేలు చేస్తున్నాయా? ఇటువంటి కులాల వారీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్దత ఉందా? లేకపోయినపుడు రాష్ట్రప్రభుత్వాలు  ఇంత పెద్ద శాతంలో రిజర్వేషన్లను ఎలా అమలు చేస్తున్నాయి? ఈ మొత్తం వ్యవహారంలో మోసపోతున్నది ఎవరు లబ్థిపొందుతున్నది ఎవరో…  గుర్తిస్తున్నది ఎందరు ?

గత శాసనసభ ఎన్నికల్లో తమిళనాడులోని కులప్రాతిపదిక పార్టీలకు ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. అందరూ ఏక మొత్తంగా జయలలిత పార్టీకి ఓట్లు వేశారు. చివరకు కులాల పేరుతే పార్టీలు పెట్టి, ఇక నేనే సీఎం అని ప్రచారం చేసుకున్న వారు కూడా  స్వంతంగా గెలవలేకపోయారు.  అన్ని వేళలా కులం కార్డు ఓట్లు రాల్చదు అనే కఠినమైన వాస్తవం నేతలకు తలకు ఎక్కేలా తమిళ ఓటర్లు గత ఎన్నికలలో తీర్పిచ్చారు. కులం పేరుతో పార్టీ పెట్టేస్తే ఆ కులం ఓట్లన్నీ సదరు పార్టీ అభ్యర్థులకు పడిపోతాయని అనుకోవద్దని ప్రజలు ఘాటుగానే హెచ్చరించారు. అయినా ఇతర ప్రాంతాల రాజకీయ నేతలకు తత్త్వం బోధపడడం లేదు.

ఒకవేళ ఎవరైనా ఓ నాయకుడు అయ్యా ఈ కులాల రిజర్వేషను తగదు, అది రాజ్యాంగ విరుద్దమైన ప్రక్రియ, రాష్ట్రం పరిధిలో అమలు చేయడం వీలు కాదు. కేంద్రం సహకరించదు. సుప్రీం కోర్టు ఇదివరకే పలు కేసుల్లో వ్యతిరేకత వ్యక్తం చేసింది. అందువలన ఎన్నికల గోదారి దాటితే చాలు అనుకుని, కులాలకు అశాస్త్రీయ శాతాలలో రిజర్వేషన్ కల్పిస్తాననే అవాంఛనీయ హామీని ఇవ్వలేను అని చెబితే….

ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ. అన్న మన వేమన మాటలు నమ్మి చిత్తశుద్ధి చూపే నాయకుని మీరు సమర్థిస్తారా? ఏం చేస్తారు?

 

మామాట : కులాల విషవలయాలను దాటండీ.. ముందుకు వెళ్లండి.

Leave a Reply