ఇపుడు మిగిలిన పరువు బరువెంత?

Share Icons:

 

చిన్నప్పుడు బడిలో ఒక పిట్ట కథ చెప్పేవారు. అందులోని సారాంశమం ఏమిటంటే… చదవేస్తే ఉన్నమతి పోయిందనీ, బడికి రాకముందు కాకరకాయ అంటున్న వాడు బడిలో చదువుకున్నతరువాత కరకరకాయ అన్నాడనీనూ.. ఇవన్నీ ఎందుకంటే.. మన సమాజం ఆధునిక సమాస్థితిని దాటేసి, ఆధునికోత్తర దశను కూడా దాటి ముందుకు వెళుతున్నట్టు సాహితీ, చరిత్రకారులు ప్రకటిస్తుంటారు. కానీ సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూసినపుడు మానవాళి ఎటువెళుతోందనే సందేహం కలగకమానదు.

 

[pinpoll id=”61459″]

 

 

 

అమృత జీవితంలో జరిగిన సంఘటనలు బుద్ధజీవులను కలవర పరుస్తున్నాయి. ఇటువంటివి ఇంతకు ముందు జరగలేదా అంటే జరిగాయి, బహుశా మూర్కులు వర్థిల్లితే మరికొన్ని కూడా జరుగుతాయి. కానీ స్వయంగా కన్న తండ్రి కంకణం కట్టుకుని కూతురు బతుకు చిదిమేయడం ఎంద దారుణం చెప్పండి.   వేమన అంటాడు…

కులము హెచ్చు తగ్గు గొడవలు పనిలేదు

సానుజాతమయ్యె సకల కులము

హెచ్చు తగ్గు మాట లెట్లెరుంగగవచ్చు

విశ్వదాభిరామ వినుర వేమ.

పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అత్యంత హేయమైన, అనాగరికమైన ఈ చర్యలను సమూలంగా నిర్మూలించాలని పేర్కొంది. ‘‘మా అభిప్రాయంలో కారణమేదైనా పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగా పరిగణించాలి. ఇలాంటి కేసుల్లో దోషులకు ఉరిశిక్ష వేయాల్సిందే’’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీకి చెందిన భగవాన్‌దాస్‌ తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా మేనమామ కొడుకును పెళ్లి చేసుకొని పరువు తీసిందన్న కోపంతో ఆమెను హతమార్చాడు. ఆ కేసును విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు పరువు హత్యలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తమ కొడుకు/కూతురు ప్రవర్తన వల్ల పరువు పోయిందని చాలా మంది భావిస్తుంటారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె/అతడు ఇతర కులస్థులను పెళ్లి చేసుకోవడం లేదా సంబంధాలు పెట్టుకోవడాన్ని అవమానంగా పరిగణిస్తారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని చంపేయడం, భౌతిక దాడులకు పాల్పడడం చేస్తుంటారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. తమ కుమార్తె లేదా ఇతర వ్యక్తి ప్రవర్తన వల్ల అసంతృప్తిగా ఉంటే అతను/ఆమెతో సామాజిక సంబంధాలను తెంచేసుకోవాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. హింసాత్మక చర్యలకు పాల్పడకూడదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అన్ని విచారణ కోర్టులు, హైకోర్టులు పరువు హత్యలను అత్యంత అరుదైన కేసులుగానే పరిగణించాలని, దోషులకు ఉరిశిక్ష విధించాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు దేశంలోని అన్ని కోర్టులకు ఉత్తర్వులిచ్చింది.

పరువు హంతకులు ఐదుగురికి ఉరి..

ఢిల్లీలో షియా వర్గానికి చెందిన యువతి సున్నీ వర్గానికి చెందిన యువకుడిని పెళ్లాడింది. దీంతో యువతి సోదరులు.. ఆ యువకుడి తమ్ముడ్ని హత్య చేశారు. 2008లో జరిగిన ఈ హత్య కేసును విచారించిన ఢిల్లీ కోర్టు దీన్ని అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించింది. యువతి కుటుంబ సభ్యులు ఐదుగురికీ 2011లో ఉరిశిక్ష విధించింది.

ఇంత జరిగింది. ఈ విషయాలన్నీ మీడియాలో వచ్చినవే కానీ మారుతీరావు నిర్భయంగా హత్యకు పురికొల్పాడు, అల్లుని హతమార్చాడు… కూతురు బతుకు చీకటి చేశాడు ఇపుడు అతనికి మిగిలిన పరువు బరువు ఎంత ? మరో మారు వేమన మాటలు గురుతు చేసుకుందాం…

అజ్ఞానమె శూద్రత్వము

సుజ్ఞానము బ్రహ్మమౌట శ్రుతులను వినరా

యజ్ఞానముడుగు వాల్మీకి

సుజ్ఞానపు బ్రహ్మమొందె జూడర వేమా .

అన్నాడు, వినడం లేదు. మంచి మాట వినని సమాజం పోకడలు ఇలాగే ఉంటాయి. దురన్యాయాలు కొనసాగుతూనే ఉంటాయి. కుల దురహంకార హంతకులను సమాజం నుంచి వెలివేయాలి. ఔనంటారా-కాదంటారా.

మామాట: ఏ పెళ్లీ ఏ చావుకూ కారణం కాకూడదు. ఐతే  అది పెళ్లే కాదు.

Leave a Reply