అంటుకో కరోనా అంటుకో…!?

Share Icons:

అంటుకో కరోనా అంటుకో…!?
****************************

నోటికొచ్చిన పిచ్చి కూతలతో, చేతబడి వ్రాతలతో
సోషల్ మీడియాను అనుక్షణం కలుషితం చేస్తున్న
కరడుగట్టిన తోపుగాళ్లను అంటుకో కరోనా అంటుకో!
త్రాష్టులను తీసుకెళ్లి శాశ్వతంగా ఐసొలేషన్లో పడేస్తాం అంటుకో!
ఇంటికే పదిలమై నిష్టగా ఉంటున్న మా జోలికి రాకుండా జారుకో.

ఈ అష్టావక్ర బుద్ధిమాంధ్యులకు ఏదీ సవ్యంగా కనిపించదు
దేశ ప్రధాని చేతులు జోడించి పదేపదే వేడుకున్నా
రాష్ట్ర ముఖ్యమంత్రులు దణ్ణం పెట్టి బ్రతిమాలుతున్నా
ఉచ్చగుంటలో ఈతకొట్టే ఉన్మాదులకు రంధ్రాన్వేషణం మినహా
విన్నవింపులు, మన్నింపులు, మతింపులు ఏవీ మతికెక్కవు.

ఇప్పుడు కదా! ఈ కోవిడ్-19 విపత్తు వచ్చిపడింది!
ఇది లేనప్పుడు? ఎల్లప్పుడూ మనకోసం, జాతి సమస్తం కోసం
సరిహద్దు రేఖలో గస్తీకాచే సిపాయిలు ప్రమాదం పొంచివున్నప్పుడు
బొంతల్లోనో, తామే త్రవ్వుకున్న గుంతల్లోనో రోజులు, నెలల తరబడి నిలబడి
మంచు కణికల నడుమ స్వీయ నియంత్రణతో ఆకలిదప్పులకు ఓర్చుకుంటూ
అవసరమైతే తమ మూత్రాన్ని తామే త్రాగి మనల్ని రక్షిస్తున్నారన్న ఎరుక మరచిన వెధవల్లారా!
కాస్తంత నోరు మూసుకొని బలాదూరు తిరుగుళ్లాపి కలోగంజో చాలనుకుని ఇళ్లకే పరిమితం కండి.

ప్రాణభయం ప్రక్కన పెట్టి కరోనా పీడిత రోగుల నడుమ నిలబడి
నిలువెల్లా తొడుగులతో, కృత్రిమ శ్వాస నాళికలతో ఊపిరి పీల్చుకుంటూ
అనవరతం సేవలందిస్తూ ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేస్తున్న వైద్యులకు,
సహాయక సిబ్బందికి, సహచరులకు, సమాజానికి, మానవజాతి మనుగడకు
మనవంతు నైవేద్యం ఒక్కటే- స్వీయ నియంత్రణతో స్వయంగా గీచుకునే లక్ష్మణ రేఖ?

లాక్ డౌన్ శాసనాలకు కట్టుబడి సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటిద్దాం
కష్టాలను కడుపులో దాచుకుని కొంతకాలం కంటకిత పరిస్థితులకు తలొగ్గుదాం
వదరుబోతుగాళ్ల వదంతులను, కుహనా మేధా(తా)వుల వాదనలను విస్మరిద్దాం
ప్రభుత్వాలు అధికారికంగా నిర్ధారించి ప్రకటించే సమాచారాన్ని మాత్రమే విశ్వసిద్దాం
కాదన్న కళ్లున్న కబోదులను అంటుకో కరోనా అంటుకో ఐసొలేట్ చేసి పూడ్చేద్దాం.

-ప్రవల్హిక
30.03.2020

Leave a Reply