కోహ్లీ వన్ మ్యాన్ షో……విండీస్ పై ఇండియా విజయం….

Share Icons:

హైదరాబాద్: కెప్టెన్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎదుట ఎంతటి బౌలర్ ఉన్న రెచ్చిపోయి ఆడాడు. కేవలం 50 బంతుల్లో 94 పరుగులు చేయడంతో విండీస్ పై ఏకపక్ష విజయం సాధించింది టీమిండియా.  కెప్టెన్ విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 94 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టడంతో హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఇక మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. హెట్‌మైర్ (41 బంతుల్లో 56; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించగా.. ఎవిన్ లూయిస్ (17 బంతుల్లో 40; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పొలార్డ్ (19 బంతుల్లో 37; 1 ఫోర్, 4 సిక్సర్లు), బ్రాండన్ కింగ్ (23 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపులు మెరిపించారు. విండీస్ బ్యాట్స్ మెన్ చెలరేగడంతో భారత బౌలర్లకు చుక్కలు కనిపించాయి. ఒక్క చాహల్(2) మినహా ఎవరు పెద్దగా ఆకట్టుకోలేదు.

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన టీమ్‌ఇండియా.. పద్ధతి ప్రకారం ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. రెండో ఓవర్‌లో రాహుల్ మూడు ఫోర్లు బాది ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభాన్నిచ్చాడు. అయితే మరో ఎండ్‌లో రోహిత్ శర్మ (8) ఆకట్టుకోలేకపోయాడు. పైర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి డీప్‌మిడ్‌వికెట్‌లో ఫీల్డర్‌కు దొరికిపోయాడు. ఇక అక్కడి నుంచి కోహ్లీ, రాహుల్ మోత మొదలైంది. కాట్రెల్, పైర్ ఓవర్లలో రాహుల్ ఒక్కో సిక్సర్ బాదాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి టీమ్‌ఇండియా వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఈ క్రమంలో రాహుల్ 37 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో లాంగ్ ఆఫ్‌లో పొలార్డ్ చేతికి చిక్కాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 100 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన పంత్ (18; 2 సిక్సర్లు) తన ట్రేడ్‌మార్క్ సిక్సర్‌తో ఖాతాతెరిచాడు.

అయితే వెంటనే వచ్చిన శ్రేయస్ అయ్యర్ 4 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక కోహ్లీ మరొకరికి ఛాన్స్ ఇవ్వకుండా 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించేశాడు. ఇక 94 పరుగుల చేసిన కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో  మ్యాచ్ తిరువనంతపురంలో ఆదివారం జరుగనుంది.

 

Leave a Reply