తెలంగాణలో దూకుతున్న కారులు….వరుస ప్రమాదాలు

Share Icons:

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వరుస కారు ప్రమాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గత ఏడాది చివరిలో హైదరాబాద్‌ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన ఘోర ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 8 మంది గాయపడిన విషయం తెలిసిందే. అతివేగంతో వచ్చిన కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది. అదే సమయంలో ఫ్లైఓవర్‌ కింద ఆటో కోసం వేచి చూస్తున్న ఓ మహిళపై కారు పడటంతో ఆమె స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు.

ఇక ఆ ప్రమాదం మరువకముందే మొన్న హైదరాబాద్ మూసాపేట పరిధిలోని భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 2గంటల సమయంలో భరత్‌నగర్ ఫ్లైఓవర్‌‌ నిర్మానుష్యంగా ఉన్న సమయంలో దాదాపు 120కి.మీ వేగంతో ఓ కారు దూసుకొచ్చింది. కారులో ఉన్న ఆరుగురు మిత్రులు.. లోపల గోల గోల చేస్తున్నారు. ఈలోపు సునీల్ అనే వ్యక్తి డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు ఒక్కసారిగా ఫుట్‌పాత్ పైకి ఎక్కి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. రెయిలింగ్ విరిగిపోవడంతో ఫ్లైఓవర్‌పై నుంచి కారు పెద్ద శబ్దంతో జేసీబీపై పడిపోయింది. నుజ్జునుజ్జయిన కారును జేసీబీ సాయంతో బయటకు తీశారు. అప్పటికే సొహైల్ అనే యువకుడు మృతి చెందినట్టు గుర్తించారు. మిగతా క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు.

భరత్ నగర్ బ్రిడ్జిపై కారు ప్రమాదం ఘటన చూడకముందే… హైదరాబాద్‌లో మరో ఘటన జరిగింది. నగర శివారులోని మియాపూర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అదే వేగంతో ముందుకు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది. అయితే ఈ దుర్ఘటనలో హోటల్‌లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఓ ప్రయివేటు పాఠశాలకు చెందిన కరస్పాండెంట్‌ అఫ్జల్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడు సంతోష్‌ మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave a Reply