రాజధాని రగడ: పవన్‌పై కేసు నమోదు చేయనున్న పోలీసులు

janasena president pawan kalyan comments on jagan and ysrcp
Share Icons:

అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని గత రెండు వారాలుగా ఆ ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఆందోళనలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్ధతిచ్చారు. అందులో భాగంగా మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మందడం వెళ్లే దారిలో పవన్‌ను పోలీసులు అడ్డగించారు. కృష్ణయపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడ్డు తగిలారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద పవన్ ను పోలీసులు నిలిపివేశారు. సచివాలయంలో సీఎం ఉన్నందున…. సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. దీంతో పవన్ నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. రోడ్డుపైనే పవన్ ధర్నా నిర్వహించారు.

పవన్ కాన్వాయ్‌ వెళ్లకుండా తాళ్లతో అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పవన్ కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో జనసైనికులు, స్థానిక రైతులు పోలీసులపై మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌పై కేసు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. పవన్ పై తుళ్లూరు పోలీసులు పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేసే అవకావాలు కనిపిస్తున్నాయి. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్ సెక్షన్ 144, 30లను బ్రేక్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కూడా వారు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పోలీసులపై కూడా మండిపడ్డారు. తప్పులు చేసిన పోలీసు, అధికారి ఎప్పటికీ తప్పించుకోలేడని మరోసారి హెచ్చరించారు. రాజధానికి వెళ్లకుండా అడ్డుకుంటాడా.. ప్రజలందరూ ఏకమై పోరాటం చేస్తే జగన్‌ పులివెందుల పారిపోతాడని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు లేకుండా సీఎం ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టలేడన్నారు. దుర్మార్గ సీఎంను ఇంటికి పంపేందుకు ప్రజలు పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలు చేయాలని, అమరావతిని కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పైసా పెట్టుబడి లేకుండా అమరావతిని నిర్మించవచ్చని, 2నుంచి 3వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతిలో నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు.

Leave a Reply