మామాట లో మీమాట పోల్ నెం.13 – స్వతంత్ర భారతావనికి వారసత్వ నాయకత్వమే దిక్కా?

Share Icons:

అనేక పోరాటాల, ఉద్యమాల, త్యాగమూర్తుల బలిదానాలతో…  రాజుల, రారాజుల, చక్రవర్తుల మరియు వలసదారుల పాలన అంతమై,  స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుని ప్రజాస్వామ్యంలోకి అడుగు పెట్టిన భారతదేశానికి వారసత్వ రాజకీయాలే దిక్కా?

 

[yop_poll id=”22″]

ఇంత పెద్ద భారతావనిలో నాయకత్వమే లేదా..? ఇంకా తల్లిచాటు కూతుళ్లను, తండ్రి చాటు కొడుకులను ఎన్నాళ్లు భరించాలి? నూతన శకానికి, సరికొత్త రాజకీయ నాయకులకు స్వాగతం పలకలేమా? వేళ్ళూనూకుపోయిన వారసత్వ రాజకీయాలకు చరమగీతం పాడలేమా..? ఇంత ప్రజాస్వామిక దేశంలో ఏం జరుగుతోంది?

తాజాగా ఈ అంశం మళ్లీ తెరపైకి ఎందుకు వచ్చిందంటే…  ఓ కోయిల కూతకు సిద్ధమట!! రాహుల్ ‘బ్రహ్మచారి’ అనే నేను- భారతదేశ ‘ప్రధాని’గా… (అంతఃకరణసుద్ధి ఎలాగూ ఉండదు కనుక) చిత్తచాంచల్యంతో..” అంటూ ముందుకు వచ్చాడు. అందుకే ఈ అంశం తెరపైకి వచ్చింది. ముత్తాత నెహ్రూ, నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్… తల్లి సోనియా కావాలని తపన పడ్డా కాలేకపోయింది. తండ్రి వారసత్వంగా ప్రధానమంత్రి పదవికి నేనున్నానంటూ ముందుకు వచ్చేశాడు రాహూల్ అందుకే వారసత్వ రాజకీయాలు కళ్ళముందు మెదలాడుతున్నాయి. వారసత్వ నాయకత్వాలున్నా లేకపోయినా భారత దేశం మాత్రం ప్రపంచ దేశాలలో సగర్వంగా తలెత్తుకు నిలబడింది. మొదటి నుంచి ఏం జరుగుతోంది.

ఇతర కాంగ్రెస్ నియమిత ప్రధానులు

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ప్రధాని ఎవరనే విషయంపై జరిగిన ఎన్నికలలో సర్దార్ వల్లాభాయ్ పటేల్ గెలిచినా.. జాతిపిత గాంధీ సూచన మేరకు జవహర్ లాల్ నెహ్రూ ప్రధాని అయ్యాడు. నాటి నుంచి చాలా కాలం ఆ కుటుంబమే వారసత్వ పాలన సాగించింది. లేదా ఆ కుటుంబ కనుసన్నల్లోనే పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ రాజీవ్ కుమారుడు రాహూల్ గాంధీ తాను ప్రధాని అవుతానని ప్రకటించాడు. జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఇది.

ప్రాంతీయంగా జరుగుతున్నదేంటి?

ఒక్క జాతీయ స్థాయిలోనే వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయా? లేక ప్రాంతీయంగా కూడా అదే నడుస్తోందా? అంటే అంతటా అదే జాఢ్యం పట్టి పీడిస్తోందనే చెప్పాలి. ఇందుకు మనమున్న రాష్ట్రాలు, మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలోని పార్టీలు, వాటిని నడుపుతున్న వారినే ఉదాహరణగా చెప్పవచ్చు. తాజాగా వాడీ వేడిగా ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వస్తే, ఇప్పటికే అక్కడ వారసులు రాజకీయ రంగప్రవేశం చేసేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు నేరుగా ఎన్నికలలో పోటీ చేస్తున్నాడు. ఇక జనతాదళ్ (ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ తన కుమారుడు కుమారస్వామి వారసత్వ పగ్గాలు చేపట్టాడు. యడ్యూరప్ప కుమారుడు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మంత్రివర్గంలో సభ్యుడుగా, కీలకంగా చెలామణి అవుతున్నాడు. కుమార్తె ఎంపిగా చెలామణి అవుతోంది.  వీరు నేరుగానే నియోజకవర్గాలలో రాజకీయాలు నెరపగల సత్తా ఉన్నవారే. ఇక తమిళనాడుతో జయలలిత రాజకీయ వారసత్వాన్ని అందుకోవడానికి శశికళ జైలు నుంచే చక్రం తిప్పుతూ పార్టీని స్థాపించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంలు వారసులం తామేనని చెబుతున్నారు. మరోవైపు డిఎంకేలో తండ్రి చాటు స్టాలిన్ ఇప్పటికే పార్టీ పగ్గాలను చేపట్టాడు.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్ బాబుకి రాజకీయ వారసత్వాన్ని అందించడానికి దొడ్డిదారిన ఆయను తన మంత్రి వర్గంలో సభ్యుడిని కూడా చేశాడు. ఏమాత్రం అనుభవం లేకపోయినా కొడుకును ఉన్నత స్థానంలో చూసుకోవడానికి చంద్రబాబు పునాదులు వేస్తున్నాడు. రాజశేఖరరెడ్డి  మరణానంతరం (ప్రస్తుత ప్రతిపక్షనేత) జగన్మోహన్ రెడ్డి రాజకీయ వారసుడనే వాదనలు వినిపించాయి. తన కుమారుడికి వారసత్వ హక్కులు ఇవ్వడానికి సిద్ధపడ్డ  సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్‌లో  వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి అందివ్వడానికి ససేమిరా అంది. ఇక అప్పటి నుంచి జనంతో మమేకమైన జగన్ తనంత తానుగా స్వయం ప్రతిభతో రాజకీయాలు నడుపుతున్నాడు.

ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేని సమయంలో భారత దేశం నడవలేదా? మొరార్జీ దేశాయ్, విపిసింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్ పేయి వంటి కాంగ్రెసేతర నాయకులు ఉన్నప్పుడు దేశం ముందుకు నడవలేదా? నడిచింది. వారసత్వ నాయకులు లేనప్పుడు కూడా దేశ సార్వభౌమత్వానికి ఎక్కడా భంగం వాటిల్లలేదు.  పీవీ నరసింహరావు హయాంలో దేశం సంస్కరణల బాట పట్టింది. మన్మోహన్ సింగ్ అప్పటి ఆర్థిక మంత్రిగా తిరుగులేని ముద్రవేసుకున్నారు. అయినా…

ఎందుకు వారసత్వానికే జనం జై కొడుతున్నారు?

ఇంత పెద్ద దేశానికి వేళ్ల మీద లెక్కపెట్టగలిగే కుటుంబాలే దిక్కా? మరెవ్వరు దిక్కులేనట్లు ఎందుకు రాజకీయవారసత్వాలనే ప్రోత్సహిస్తున్నారీ జనం. వారు లేకపోతే రాజ్యమే నడవదన్నట్లు తాబేదారులు ప్రకటనలు చేయడం, రాజులు రాజ్యాలు పోయి శతాబ్ధాలు గడిచినా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి 7 దశాబ్దాలు పూర్తయినా సరే ఎందుకు మనం సామర్ధ్యం లేని వారసులకు పట్టం కడుతున్నాం? తమ కుటుంబాలు లేకపోతే భారతదేశానికి లేదా  రాష్ట్రానికి అపారమైన నష్టం అనేంతగా ఈ రాజకీయ మాయగాళ్లు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మందస్వామ్యంగా మార్చేస్తున్నారు. రాచరికాలు అంతరించినా వారసత్వ నాయకత్వాలు మాత్రం రోజు రోజుకూ వేళ్లూనుకుని ప్రజాస్వామ్య వ్యవస్థను వెక్కిరిస్తున్నాయి.

మామాట : ఓటరు నోటుకు అమ్ముడుపోయినంత కాలం రాజకీయ పాలెగాళ్లదే రాజ్యం. ప్రజాస్వామ్యం పూజ్యం..

2 Comments on “మామాట లో మీమాట పోల్ నెం.13 – స్వతంత్ర భారతావనికి వారసత్వ నాయకత్వమే దిక్కా?”

  1. మీ పోల్స్ అన్ని చాలా బాగుంటాయి. నేను రోజు ఎదురు చూస్తుంటాను. Good work. Keep going

Leave a Reply