అమరావతి: మే31 లోపు విశాఖపట్నం వెళ్లడానికి సచివాలయ ఉద్యోగులు అంగీకారం తెలిపారు. కాకపోతే ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు మేలో రాజధానిని అమరావతికి తరలించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారతాయా, కీలక సమస్యల పరిష్కారం చేయకుండా రాజధాని తరలింపు సాధ్యమేనా అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. అయితే విశాఖ వెళ్లేందుకు ఉద్యోగులు సిద్ధం కావడమొక్కటే జగన్ సర్కారుకు ఊరటగా కనిపిస్తోంది.
ఏపీలో అధికార వికేంద్రీకరణకు ఉద్దేశించిన రెండు బిల్లులను సెలక్ట్ కమిటీ పేరుతో పెండింగ్ లో పెట్టిన శాసనమండలి రద్దు కోసం అసెంబ్లీ కేంద్రానికి తీర్మానం చేసి పంపింది. అయితే ఇంతవరకూ దాన్ని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు.
అలాగే ఏపీ సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కార్యాలయాలను రెండింటిని కర్నూలుకు తరలిస్తూ సీఎస్ నీలం సాహ్నీ ఇచ్చిన ఆదేశాలు సైతం వివాదాస్పదమయ్యాయి. వీటిపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు విచారణ జరిపినా తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. మరోవైపు తమ అనుమతి లేకుండా కార్యాలయాలను తరలిస్తే దానికి అయిన ఖర్చును సదరు అధికారుల నుంచే వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరికలు కూడా చేసింది. దీంతో కార్యాలయాల తరలింపును జీవోల ద్వారా చేపట్టే పరిస్ధితి కనిపించడం లేదు.
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్ధానిక ఎన్నికలకు ఆరు వారాలకు వాయిదా పడ్డాయి. ఆరువారాలని చెబుతున్నా మూడు నెలలు పడుతుందని అనధికార వర్గాలు చెబుతున్నాయి. మే నెల లోపు అమరావతి నుంచి విశాఖకు రాజధానిని తరలించాలంటే ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభం కావాలి, కానీ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో వ్యవస్ధలన్నీ స్తంభింప చేయాల్సిన పరిస్ధితి, మొన్న ఎన్నికలు వాయిదా పడితే, ఆ తర్వాత గుళ్లు తాజాగా స్కూళ్లు, కాలేజీలు మూత పడుతున్నాయి. దీంతో రేపు ఎన్నికల నిర్వహణే కాదు రోజువారీ కార్యక్రమాల నిర్వహణ కూడా సాధ్యం కాని పరిస్ధితులు వస్తాయోమేనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆ లోపు పార్లమెంటులో మండలి రద్దు బిల్లు ఆమోదం పూర్తి కావాల్సి ఉంది.. కనీసం ఏప్రిల్ చివరి నాటికి సమస్యల వలయం నుంచి బయటపడినా మే నెలలో హుటాహుటిన తరలింపు చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.