కశ్మీర్ లో హౌస్ అరెస్ట్ లో నేతలకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నాం…

Brown bread, Hollywood movies, gym access.. MoS Singh says met every demand of Kashmir house guests
Share Icons:

ఢిల్లీ: గత నెలలో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి అలజడులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా అక్కడ కేంద్ర బలగాలని మోహరించారు. ఇంటర్నెట్ ఆపేశారు. అలాగే పలు సేవలని నిలిపివేశారు. ఇక అప్పుడే మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ, ఎన్‌సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వంటి వారిని గృహ నిర్బంధంలోకి తీసుకుంది. అయితే మిగతా విషయాల్లో ఆంక్షలు ఎత్తివేసిన….నేతలు మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు.

ఇక వీరి నిర్బంధం విషయమై తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ … జమ్మూకశ్మీర్ నాయకులను అరెస్టు చేయలేదని, వారిని 18 నెలలకు మించి హౌస్ గెస్టులుగా ఉంచబోమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.‘‘ జమ్మూకశ్మీర్ నాయకులను వారి వీఐపీ బంగళాల్లోనే ఉంచాం. వారికి హాలీవుడ్ సినిమాల సీడీలు కూడా అందిస్తున్నాం. నేతలకు జిమ్ సౌకర్యాలు కూడా కల్పించాం. నాయకులను తాము హౌస్ అరెస్టు చేయలేదని, వారిని హౌస్ అతిధులుగా ఉంచాం’’ అని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా మనదేనని, జమ్మూకశ్మీర్ సరిహద్దులను పునరుద్ధరించడానికి తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయమై 1994లో పార్లమెంటులో ఓ తీర్మానాన్ని ఆమోదించామని గుర్తు చేశారు.

అటు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ఏర్పాటుకు నాడు జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. 1947లో కాల్పుల విరమణ ప్రకటించడం ఓ తప్పిదమని, భారత్ ఆధిక్యం కొనసాగుతున్నవేళ ఆ నిర్ణయం పీవోకే ఏర్పాటుకు దారితీసిందని అన్నారు. కశ్మీర్ అసమగ్రతకు నెహ్రూనే బాధ్యత వహించాలని, సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అవకాశం ఇచ్చివుంటే పరిస్థితిని చక్కదిద్ది ఉండేవాడని అమిత్ షా అభిప్రాయపడ్డారు. పటేల్ చేపట్టిన సంస్థానాల విలీనం ప్రక్రియ అంతా సజావుగానే సాగిందని, నెహ్రూ చేపట్టిన కశ్మీర్ అంశం మాత్రం సమస్యాత్మకం అయిందని అభిప్రాయపడ్డారు.

 

Leave a Reply