ఈ మాట చంద్రబాబుని ఎప్పుడైనా అడిగారా?

botsa satyanarayana comments on ap capital
Share Icons:

అమరావతి: ఏపీ రాజధాని విషయంపై హై పవర్ కమిటీ నివేదికని సీఎం జగన్‌కు అందజేసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ…ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలనే అంశంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హై పవర్ కమిటీ అధ్యయనం చేసిన వివరాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు.

అమరావతిలో రైతుల ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, వారికి న్యాయం జరిగేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. సీఆర్డీఏ చట్టం రద్దు విషయం తమ దృష్టిలో లేదన్నారు. హైపవర్‌ కమిటీ ఈమెయిల్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని బొత్స ఆరోపించారు. అసెంబ్లీ భవనం గురించి అడగ్గా.. ఈ అసెంబ్లీ పర్మినెంట్‌ అని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? అని ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబే తాత్కాలిక భవనం అన్నప్పుడు, దాన్ని తామెలా శాశ్వత భవనం అంటామని అడిగారు.

ఏపీ రాజధాని ఏది? అంటూ తమని అడుగుతున్నారని, అదే ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబును ఎప్పుడైనా అడిగారా? అని ఘాటుగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం అమరావతికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదని, తాను చెప్పేవరకు ఎవరూ దాని గురించి కనీసం ప్రస్తావించలేదని గుర్తుచేశారు. రాజధానిపై అప్పట్లో జగన్‌ చేసిన ప్రకటనను సరిగా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రాజధానికి 33 వేల ఎకరాల భూమి అవసరమేనని, అయితే అది ప్రభుత్వ భూమి అయితే బాగుంటుందని జగన్‌ చెప్పారని బొత్స తెలియజేశారు.

తమ దృష్టికి వచ్చిన సమస్యలపై కేబినెట్‌లో చర్చించి అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్తామని, రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలన్నది హైపవర్ కమిటీ రిపోర్ట్‌లో స్పష్టంగా చెప్తామని ఆయన స్పష్టంచేశారు. దేశంలోనే రైతుల ప్రయోజనాలకు కట్టుబడిన పార్టీ వైసీపీ అని, రైతులకు చిన్న కష్టం వచ్చినా పెద్ద ఉపద్రవం ఎదురైనట్లుగానే తాము భావిస్తామని ఆయన చెప్పారు. రాజధాని రైతులు ఉద్యమ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని బొత్స సూచించారు.

 

Leave a Reply