ప్రజా స్వామ్యానికి దుర్దినం

Share Icons:

ప్రజా స్వామ్యానికి దుర్దినం

కారణం ఏదైనా కానీ నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టు వ్యవహారాలపై బహిరంగంగా విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి దుర్దినం.

సుప్రీంకోర్టు పాలనా విభాగంలో జరుగుతున్న అవకతవకలను కొద్ది రోజుల ముందుగానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నలుగరు న్యాయమూర్తులు ఒక లేఖ ద్వారా తెలియచేశారు.

అయినా వారి ఆవేదనను తీర్చే ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్చలేదనేది ప్రధాన అభియోగం.

ఇది దారుణమైన విషయం. సమస్య ఎంత తీవ్రంగా లేకపోతే సీనియర్ న్యాయమూర్తులు లేఖ రాస్తారు?

ఆ లేఖపై స్పందన లేకపోవడం వల్ల మరింతగా వారు ఆవేదన చెంది ఉంటారనడంలో సందేహం లేదు.

ఆ ఆవేదన కూడా తీవ్ర రూపం దాల్చడం వల్లే వారు బహిరంగ విమర్శలకు ఉపక్రమించి ఉంటారు. ఇదంతా జరగడం ఎంతో దురదృష్ట‌క‌రం.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి త‌ర్వాతి స్థానంలో ఉన్న జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్‌, జ‌స్టిస్ మ‌ద‌న్ లోకూర్‌, జ‌స్టిస్ కురియ‌న్ జోస‌ఫ్‌, జ‌స్టిస్ రాజ‌న్ గోగోయ్‌లు ఈ విధంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల దేశంలో సామాన్య పౌరుడిలో న్యాయ‌వ్య‌వ‌స్థ ప్ర‌తిష్ట దిగ‌జారి ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రా ఈ న‌లుగురు సీనియ‌ర్ న్యాయ‌మూర్తులు చేసిన సూచ‌నలు, వెలిబుచ్చిన ఆవేద‌న‌ను ఎందుకు అర్ధం చేసుకోలేదు?

ఇందుకు ఏవైనా బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయా?

రాజ‌కీయ వ‌త్తిడులు ఉన్నాయా?

రాజ‌కీయ వ‌త్తిడులు ఉన్నాయా? ఇలాంటి సందేహాల‌ను నివృత్తి చేయాల్సిన అవ‌స‌రం ఇప్ప‌డు ఎంతైనా ఉంది.

సుప్రీంకోర్టులో జ‌రుగుతున్న ప‌రిణామాలపై ప్ర‌ధాన న్యాయ‌మూర్తి కి సంపూర్ణ న‌మ్మ కం ఉంటే అదే విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డి చేయాల్సి ఉంటుంది.

లేక‌పోతే ప్ర‌ధాన న్యాయమూర్తిపైనే అనుమానాలు ముసురుకుంటాయి. రాజ‌కీయ వ‌త్తిడులు ఉంటే దాన్ని కూడా ఆయ‌న వెల్ల‌డించాలి.

అస‌లు ఇలాంటి వివాదం రేగ‌డ‌మే అత్యంత దుర‌దృష్ట‌క‌రం. ఈ సంఘ‌ట‌న‌పై చ‌ర్చించుకోవాల్సి రావ‌డం కూడా మ‌రింత దౌర్బాగ్యం. ఈ వివాదం ఇంత‌టితో ఆగ‌దు. అంత వ‌ర‌కూ మ‌నం కచ్చితంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌ధానిగా న‌రేంద్ర‌మోడీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి చాలా వ్య‌వ‌స్థ‌లు వివాదాల్లోకి వ‌చ్చాయి.

ఎన్నిక‌ల సంఘం ఇప్ప‌టికే చాలా వివాదాల్లోకి వ‌చ్చింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం భార‌తీయ జ‌న‌తా పార్టీకి అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు దేశ ప్ర‌జ‌లంద‌రికి గుజ‌రాత్ ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌డంలో జాప్యం చేసిన నాటి నుంచి అర్ధ‌మైపోయింది.

అంత‌కు ముందు కూడా ఎన్నిక‌ల సంఘం ప‌క్ష‌పాతంతో చాలా సార్లు ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అదే విధంగా సిబిఐ కూడా కేంద్రంలోని ప్ర‌భుత్వ పెద్ద‌ల అడుగుల‌కు మ‌డుగులు వ‌త్త‌తున్న‌ట్లు ఇప్ప‌టికే చాలా సంద‌ర్భాల‌లో వెల్ల‌డైంది.

ప్ర‌ధానికి వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిన చాలా మీడియా సంస్థ‌ల‌పై సిబిఐ దాడులు చేసిన విష‌యం అంద‌రికి తెలిసిందే. గుజ‌రాత్‌లో ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎంఎల్ఏల‌ను వారికి ఆశ్ర‌యం ఇచ్చిన వారికి ఎన్ని వేధింపులు ఎదురయ్యాయో తెలియ‌నిది కాదు.

ఎన్‌ఫోర్సుమెంటు డైర‌క్ట‌రేటు లాంటి సంస్థ‌లు కూడా వివాదాల్లోకి వ‌చ్చాయి.

రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి కూడా ఇటీవ‌లి కాలంలో వివాదాస్ప‌దంగా మ‌రింది.

కాంప్ర్టోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ లాంటి రాజ‌కీయ అతీతంగా ఉండాల్సిన వ్య‌వ‌స్థ‌లు ఏనాటి నుంచో రాజ‌కీయాల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి.

వీట‌న్నింటికి ఇది ప‌రాకాష్ఠ‌. సాక్ష్యాత్తూ న్యాయ వ్య‌వ‌స్థ ఇలా బ‌హిరంగ వేదిక‌పైకి వ‌చ్చి విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం అత్యంత దారుణ‌మైన విష‌యం.

దీనికి బాధ్యులు ఎవ‌రైనా నైతిక బాధ్య‌త‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకోవాల్సి ఉంటుంది.

Leave a Reply