గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి

Share Icons:
గ్రేటర్ లో దూకుడు పెంచిన బిజెపి
హైదరాబాద్‌‌లో పాలిటిక్స్‌  హీటెక్కాయి. గ్రేటర్ ఫైట్ ఆరంభంలోనే టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. వరద సాయం ఆపారని టీఆర్ఎస్‌.. ఆపాల్సిన అవసరం మాకేంటంటూ బీజేపీ విరుచుకు పడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తమకు పోటీ టీఆర్ఎస్ కానేకాదని…మజ్లిస్ తోనే పోటీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ ఓల్డ్ సిటీ వర్సెస్ రెస్టాఫ్ సిటీ మధ్య ఉండబోతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న బీజేపీ గ్రేటర్ మాదేనంటూ ధీమా వ్యక్తం చేసింది. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలు మరోసారి జీహెచ్ఎంసీ పగ్గాలు చేపట్టేందుకు సిద్దమయ్యాయి.
హైదరాబాద్‌ గ్రేటర్ ఎలక్షన్‌ దుబ్బాక ఉపఎన్నికను తలపిస్తోంది. అక్కడ కాంగ్రెస్‌ మూడో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం గ్రేటర్‌ ఎలక్షన్‌లోనూ అధికార టీఆర్ఎస్‌.. బీజేపీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. కాంగ్రెస్ నగరంలో నామ మాత్రం కూడా లేదన్న భావన కలుగుతోంది.కాంగ్రెస్ అవసరాన్నిబట్టి ప్రధాన శత్రువును ఓడించేందుకు చివరి నిమిషంలో ఓట్లను టి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా బలమైన అభ్యర్ధికి మార్పిడి చేసే ఆలోచనలున్నట్లు తెలుస్తొంది. ఈ నేపధ్యంలో బీజేపీ మిత్రపక్షమైన జనసేన గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమైనా, ముందస్తు ప్రణాళిక, ఒప్పందం లేనందున ప్రత్యక్షంగా తలపడకూదదని నిర్ణయించి తమ కార్యకర్తలు బిజెపి కి మద్దతు గాఉంటారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమలం కసరత్తు చేస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో జరిగే ఎన్నికల్లో సత్తా చాటేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గతంలో హైదరాబాద్‌కు ఉన్న ఒకే ఒక అధ్యక్ష పదవికి స్వస్తి పలికి ఆ స్థానంలో నలుగురు అధ్యక్షులను నియమించారు. అలాగే మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలకు సైతం అధ్యక్షులను ప్రకటించారు. బీజేపీ హైకమాండ్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంస్థాగతంగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు నేపథ్యంలో గ్రేటర్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు జీహెచ్ఎంసి ఎన్నికలు మంచి అవకాశంగా కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి.
గతంలో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అప్పుడు బిజెపి నుండి గ్రేటర్లో ముఖ్య నేతలు ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఫలితాలను రాబట్టలేకపోయింది. గతంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా కార్పొరేటర్ల ను గెలిపించుకోలేక పోయారు. ఇక ఇప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఒక ఎమ్మెల్యే సీటు పరిమితమైంది. కానీ ఎమ్మెల్యేగా ఓటమి పాలైనా, ఎంపీగా కిషన్ రెడ్డి విజయం సాధించి, ఏకంగా కేంద్ర మంత్రిగా పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా బిజెపి అగ్ర నాయకత్వం దూకుడు చూపించగలిగిన నేత అయిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పగించి దూసుకుపోవాలని సూచించింది. టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల సమయంలో ఇచ్చిన నెరవేర్చని హామీలను, ఇటీవల వర్షాలు వరదల కారణంగా హైదరాబాద్ పరిస్థితిని ప్రధాన ప్రచార అస్త్రాలుగా మలచుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు బిజెపి సిద్ధమౌతోంది.
గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ అభ్యర్ధులనుచివరి నిమిషంలో హడావుడిగా ఎంపిక చేయడం కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకునేందుకు బిజెపి అవకాశం కల్పించింది. ఆసక్తి ఉన్నవారి దరఖాస్తులను పరిశీలించి, అందులో ఎవరైతే విజయం సాధిస్తారన్న అంశాన్ని క్షేత్రస్థాయిలో బేరీజువేసి, కచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం దక్కేలా వారికే టిక్కెట్లు ఖరారు చేసారట.
2002లో హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌కి ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న సమయంలో గ్రామ పంచాయతీ సర్పంచ్‌, సమితి అధ్యక్షులు మొదలుకొని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌లు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌లు కార్పొరేషన్‌ల మేయర్‌ పదవుల వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 24మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు లోక్‌సభ సభ్యులు మరికొందరు హైదరాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిపి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొనడానికి మరొక 150మంది అవుతున్నారు. వీళ్లంతా కలిస్తే 200 పైనే అవుతారు.
150 డివిజన్లలో 76 డివిజన్‌లు గెలిచినవారు మేయర్‌ అవుతారు అన్న గ్యారెంటీ కూడాలేదు. జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు మేయర్‌ను ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఇస్తే ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన కార్పొరేటర్ల పాత్ర నామమాత్రమే అవుతుంది. ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీకి మద్దతు ఇచ్చిన వారు కూడా ఉంటున్నారు. బొటాబొటి మెజారిటీ వచ్చిన సందర్భాలలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు ఎంపీలు ఫిరాయించినట్టుగానే కార్పొరేటర్లు కూడా పార్టీలు ఫిరాయించి ప్రజల ఆకాంక్షలకు గండి కొడుతున్నారు.
-ఎన్నార్కె

Leave a Reply