విస్త‌ర‌ణ కాంక్ష‌లో విలువ‌ల హ‌న‌నం

Share Icons:

విస్త‌ర‌ణ కాంక్ష‌లో విలువ‌ల హ‌న‌నం

ఒక గోవా…  ఒక త‌మిళ‌నాడు… ఒక త్రిపుర‌

మూడు రాష్ట్రాలు. మూడు ర‌కాల రాజ‌కీయ‌ సంక్షోభాల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌న‌కు అనువుగా మార్చుకున్న‌ది. బ‌ల‌హీనంగా ఉన్న చోట్ల బ‌ల‌ప‌డ‌టానికి రాజ‌కీయ పార్టీలు చేసే ప్ర‌య‌త్నాల‌ను త‌ప్పు ప‌ట్ట‌లేం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ ప‌ని చేసినా చూస్తూ ఊరు కోవ‌డం త‌ప్ప మ‌రేం చేయ‌లేం. ఇవ‌న్నీ క‌రెక్టే. కానీ నైతిక విలువ‌లు అనేవి ఉంటాయి. వాటికి అనుగుణంగా ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. అలా జ‌ర‌గ‌ని నాడు ఆయా రాజ‌కీయ పార్టీలు నీతులు చెప్పే అర్హ‌త‌ను కోల్పోతాయి.

గ‌తంలో కేంద్రంలో అధికారంలో ఉన్న‌పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే రాజ‌కీయ క్రీడ‌లు ఆడిందో అదే ర‌క‌మైన రాజ‌కీయ క్రీడ‌ల‌ను బిజెపి కొన‌సాగిస్తున్న‌ది. ప్ర‌జ‌ల అభిప్రాయం వ్య‌తిరేకంగా ఉన్నా కూడా గ‌తంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల‌లో గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుని దొడ్డ‌దారిన అధికారం చేపట్టేది. ఇప్పుడు స‌రిగ్గా అదే జ‌రుగుతున్న‌ది. అందుకే ఆనాటి కాంగ్రెస్ పాల‌న‌కు ఈనాటి బిజెపి పాల‌న‌కు పెద్దగా తేడా క‌నిపించ‌డం లేదు.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగాయి. బిజెపికి కేవ‌లం మూడు అసెంబ్లీ సీట్లు వ‌చ్చాయి. కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలోని ఆప్ చావుదెబ్బ కొట్టింది. అదే విధంగా బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బిజెపికి జ‌రిగింది. ఆ త‌ర్వాత త‌న అధికారంతో అధికార కూట‌మిని చీల్చి తాను అధికారంలోకి వ‌చ్చింది బిజెపి.

40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు గెలుచుకోగా, బిజెపి 13 స్థానాలను గెలుచుకున్న‌ది. అయితే తమకు 21 మంది సభ్యుల మద్దతు ఉందని అప్ప‌టి ర‌క్ష‌ణ మంత్రి, గోవా మాజీ ముఖ్య‌మంత్రి మనోహర్ పారికర్ పేర్కొంటూ, వారి మద్దతు లేఖలను సైతం అందజేయడంతో గవర్నర్ మృదులా సిన్హా ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు.

ఈ మెజారిటి ఎలా వ‌చ్చింది? వ‌స్తుంది అంతే. పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌ను అడ్డుకుని అధికారంలోకి వ‌చ్చేయ‌డం గోవాలో బిజెపికి సుళువుగా జ‌రిగిపోయింది. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఇలానే చేసింది అని బిజెపి చెబుతూ ఉంటుంది. మ‌రి మీకు వారికి తేడా ఏమిటి మ‌హాశ‌యా?

తమిళనాడులో ప‌టిష్ట‌మైన నాయ‌కురాలు జ‌య‌ల‌లిత అధికారంలో ఉండ‌గా అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఈ అవ‌కాశాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకోవ‌డానికి బిజెపి ప‌డ‌రాని పాట్లు ప‌డింది. తమిళనాడును తమ ఆధీనంలోకి తీసుకుని జెండాను ఎగురవేయాలన్న ఆలోచనతో ప‌లుర‌కాల వ్యూహాల‌ను బిజెపి అమ‌లు చేసింది. ప‌న్నీర్ సెల్వంను పావుగా ఎంచుకుని ఎత్తుగ‌డ‌లు వేశారు. కొంత వ‌ర‌కూ బిజెపి రాజ‌కీయం న‌డిచింది కానీ ఆ త‌ర్వాత ముందుకు సాగ‌లేదు.

ద‌క్షిణాదిలో పాగా కోసం క‌మ‌లం పాట్లు

దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాల్లో పాతుకుపోయిన పార్టీలు ఉంటే వాటిని పక్కకు పంపించో, లేకుంటే ఆ పార్టీలోని నేతలు తమవైపు తిప్పుకుని
తమ కన్నుసన్నల్లోనే పాలన సాగాలన్న ఉద్దేశంలో ఉంది బిజెపి. శశికళ రాజ‌కీయం ముందు అది ఏ మాత్రం పనిచెయ్యలేదు. ఇక చెయ్యి జారిపోయిందిలే అనుకున్న సమయంలో మళ్ళీ మరో అవకాశం వచ్చింది.

శశికళ జైలుకు వెళ్ళడం, ఆమె నియమించిన అల్లుడు దినకరన్ జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం, పార్టీకి వీరిద్దరు దూరమైపోవడంతో మళ్ళీ బిజెపి రంగంలోకి దిగింది. పన్నీరు సెల్వంను రంగంలోకి దింపి మళ్ళీ సిఎం అవ్వాలని ఆదేశించింది. చివ‌ర‌కు సెల్వం ఈ విష‌యాలన్నీ బ‌య‌ట్ట‌బ‌య‌లు చేశారు.

బ‌లం లేని చోట కూడా అధికారం కావాల‌ని ప్ర‌య‌త్నించే బిజెపిని ఏమ‌నాలి? ఇదే రాజ‌కీయం అంటే అని ఆ నాయ‌కులు చెబితే మాత్రం మ‌నం నోట్లో వేలు వేసుకుని వినాల్సిందే.

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలువచ్చాయి, త్రిపురలో వేర్పాటువాద ఇండిజీనియస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (ఐపిఎఫ్‌టి)తో కలిసి పోటీ చేసిన బిజెపి విజయం సాధించింది. 25 ఏళ్ల పాటు పాలనసాగించిన సిపిఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది.

60 స్థానాలున్న త్రిపురలో 59 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. వీటిలో బిజెపి 35 స్థానాల్లోనూ, దాని మిత్రపక్షమైన ఐపిఎఫ్‌టి 8 స్థానాల్లోనూ విజయం సాధించాయి. సిపిఎం 16 స్థానాల్లో గెలుపొందింది. బిజెపి అధికారంలోకి వ‌చ్చింది.

త్రిపుర ఎన్నిక‌ల్లో బిజెపి ప‌డ‌రాని పాట్లు ప‌డింది. మొత్తంగా ప‌ది ల‌క్ష‌ల ఓట్లు కూడాలేని రాష్ట్రంలో గెలిచి దేశం నుంచి క‌మ్యూనిస్టుల‌ను, కాంగ్రెస్‌ను తొల‌గించేశామ‌ని ప్ర‌చారం చేసుకున్న‌ది. అధికారంలోకి ఇంకా అడుగు పెట్ట‌క ముందే అక్క‌డ సాంస్కృతిక దాడిని ప్రారంభించింది. లెనిన్ విగ్ర‌హాల‌ను ప‌డ‌గొట్టించింది.

నైతిక ఓట‌మి మీది కాదా మ‌హాశ‌యా!

ఈ మూడు ఉదాహ‌ర‌ణ‌లు చెబితే చాలు బిజెపి రాజ‌కీయం ఏమిటో అర్ధ‌మైపోతుంది. గెలుపే ల‌క్ష్య‌మ‌ని, అందుకోసం విలువ‌ల‌ను తాక‌ట్టు పెడ‌తామ‌ని క‌మ‌ల‌నాథులు అంటే ఎవ‌రూ చేయ‌గ‌లిగింది ఏమీ లేదు. ఒక‌టి రెండు రాష్ట్రాల ఓడిపోయినా కొంప‌లేం అంటుకుపోవు. అయినా అధికార దాహం గాడితప్పి ప్ర‌వ‌ర్తించేలా చేసింది. ఇలా చేయ‌డం వ‌ల్ల గెలుపు సిద్ధించినా నైతిక ఓట‌మి సంప్రాప్తిస్తుంది.

 

English Summery: BJP wrestling  the power in the states where there is no majority against the will. News of the expanding BJP into south India caught like wild fire. BJP playing all its political cards like the Congress in older times, compromising the moral values.

Leave a Reply