కోవింద్ అందరివాడేలే..

Share Icons:

వార్త:

దిల్లీ: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ప్రకటించారు. కోవింద్ ప్రస్తుతం బిహార్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. బీజేపీలో అత్యంత ఉన్నతస్థాయికి ఎదిగిన దళిత నేత రామ్‌నాథ్‌ అని షా కొనియాడారు.

వ్యాఖ్య:

రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాత్ కోవింద్ ను ప్రకటించడం ద్వారా ఎన్డీయే సస్పెన్స్ కు తెరదించింది. అంతేకాదు, నో చెప్పలేని విధంగా విపక్షాలను ఇరుకున పెట్టిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ప్రధాని మోదీ తన రాజకీయ వ్యూహ నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించారని వారు విశ్లేషిస్తున్నారు.

విశ్లేషణ:

ఇంతకీ ఎవరీ రామ్ నాథ్ కోవింద్? ఎందుకు హఠాత్తుగా ఈయన పేరు తెరమీదకు వచ్చింది? తన రాజకీయ గురువు, బీజేపీ కురువృద్ధుడు అయిన ఎల్.కె. అద్వానీని రాష్ట్రపతి చేయాలని ప్రధాని మోడీ భావించినట్టు మొదట వార్తలు వెలువడ్డాయి. అయితే, అయోధ్య వివాదం ఎప్పటికప్పుడు రగులుతుండటంతో విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతాయని భావించి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తర్వాత బీజేపీ సీనియర్ మురళీ మనోహర్ జోషీ దగ్గర నుంచి అనేకమంది పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా వార్తల కెక్కింది. ఇదంతా ఒకవైపు సాగుతుండగా, మరోవైపు బీజేసీ సీనియర్ నేతల బృందం విపక్షాలతో చర్చలు జరిపింది. అభ్యర్థి ఎవరో చెబితేనే మద్దతు విషయం తెలియజేస్తామని అన్ని పక్షాలు తెగేసి చెప్పడంతో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపికచేయాల్సిన పరిస్థితి బీజేపీకి వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తిగాపని చేసిన రామ్ నాథ్ కోవింద్ పేరు ఆవిధంగా పైకి వచ్చింది.

ప్రధాని మోడీతో రామ్ నాథ్ కోవింద్

1994 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. 1998 నుంచి 2002 వరకు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కోవింద్ పని చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా, కోలి సమాజ్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2015 ఆగస్ట్ నుంచి బీహార్ గవర్నర్ గా కోవింద్ కొనసాగుతున్నారు. 1945 అక్టోబర్ 1న ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలోని దేరాపూర్ దగ్గర పరాంఖ్ లో జన్మించిన కోవింద్.. భారతదేశపు 14వ రాష్ట్రపతిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేయనున్నారు.

విలాసం:

రాష్ట్రపతి ఎవరైతేనేం.. రబ్బర్ స్టాంపే కదా అని మేథావులు పెదవి విరుస్తున్నారు. అయితే, రాష్ట్రపతి పదవి కోసం పోటీపడినవారితో పోలిస్తే కోవింద్ వివాదరహితుడు కావడం కాస్త ఉపశమనం కలిగించే అంశమేనని వారు అంటున్నారు. అందుకే ఆయనకు అన్ని పక్షాల మద్దతు కూడా లభించొచ్చని భావిస్తున్నారు.

-లైన్ కింగ్

8 Comments on “కోవింద్ అందరివాడేలే..”

  1. కోవింద్ అందరివాడు కావాలని అందరం ఆకాంక్షిద్దాం. పరిచయం, విశ్లేషణ క్లుప్తంగా చక్కగా ఉంది..

  2. నమో విసిరిన పాచికకు తిరుగేలేదు. రెండోమాటే లేదు. కోవిందయ్యే కాబోయే రాష్ట్రపతి.

Leave a Reply