జేసీ ఫ్యామిలీపై బీజేపీ కన్ను….పదవులు ఆఫర్…

Share Icons:

అనంతపురం: ఏపీలో బలపడాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న బీజేపీ…ఇతర పార్టీలకు చెందిన నేతలని తమ పార్టీ వైపు ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలని పార్టీలో చేర్చుకున్నారు. ఇక మరికొందరు నేతలని కూడా చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని బీజేపీలో చేర్చుకున్నారు. ఆదినారాయణ చేరిక ప్రభావం జమ్మమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాపై ఉంటుందని, ఈ మూడు నియోజకవర్గాల్లో బలపడటానికి అవకాశం దొరికినట్టయిందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఇక అనంతపురం జిల్లాలో మంచి పట్టు ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని కూడా చేర్చుకుంటే ఇంకా లాభం ఉంటుందని భావిస్తుంది.

జేసీ కుటుంబాన్ని చేర్చుకుంటే అనంతపురం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు చిక్కుతుందనే అభిప్రాయం వారిలో నెలకొంది. ఇదే అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సైతం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జేసీ దివాకర్ రెడ్డి దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం వారిద్దరూ కాంగ్రెస్ ను వీడారు. జేసీ టీడీపీలో చేరగా.. కన్నా బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి.

జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయలేదు. తమకు బదులుగా కుమారులు పవన్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను ఎన్నికల బరిలో దించారు. పవన్ రెడ్డి అనంతపురం లోక్ సభ అభ్యర్థిగా, అస్మిత్ రెడ్డి తాడిపత్తి అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి, దారుణ పరాజయాన్ని చవి చూశారు.అయితే ఓటమి తర్వాత జేసీ ఫ్యామిలీ టీడీపీలో అంత యాక్టివ్ గా కనపడటం లేదు. జేసీ దివాకర్ రెడ్డి ఒక్కరే తరచూ తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలాకాలం పాటు కాంగ్రెస్ లో కొనసాగడం వల్ల తెలుగుదేశం అంటే జేసీ కుటుంబానికి పెద్దగా అనుబంధం ఏమీ లేదు. రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశంతోనే తాను టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లు జేసీ దివాకర్ రెడ్డి బాహటంగా చెప్పుకొన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత సొంత పార్టీపైనే జేసీ ఈ మధ్య విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇక దీన్నే ఆసరాగా తీసుకున్న బీజేపీ…తమ పార్టీలో చేరితే కుటుంబానికి మంచి పదవులు ఇస్తామని ఆఫర్ ఇచ్చి. పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి ప్రత్యామ్నాయంగా తామే ఎదుగుతున్నామని బీజేపీ నాయకులు జేసీ కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి జేసీ ఫ్యామిలీ బీజేపీ ఆఫర్లకు లొంగుతుందో లేదో చూడాలి.

Leave a Reply