భారత రాజ్యాంగం కాకుండా…టీడీపీ వేరే రాజ్యాంగం ఏదైనా రాసుకుందేమో: జీవీఎల్

Share Icons:

ఢిల్లీ, 22 జూన్:

తెలుగుదేశం నేతలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. రాజ్యసభ టీడీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేసే హక్కు రాజ్యసభ చైర్మన్ కు లేదని టీడీపీ నేతలు చెప్పడంపై జీవీఎల్ సెటైర్లు వేశారు.

వేరే రాజ్యాంగం ఏదైనా తెలుగుదేశం పార్టీ రాసుకుందేమో తెలియదు గానీ, భారత రాజ్యాంగం ప్రకారం అయితే సభ్యులు ఎవరైతే ఉన్నారో వారే నిర్ణయం తీసుకోవాలి తప్పా వేరే వారు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు.

అయితే ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న టీడీపీలో మూడింట రెండు వంతులు అంటే ఆరుగురిలో నలుగురు కలిసి వస్తే విలీనం కింద ట్రీట్ చేయబడుతుందని, ఈ విషయాన్ని షెడ్యూల్ 10 లో పార్ట్ 4 లో స్పష్టంగా చెప్పారని అన్నారు.

దీని మీద టీడీపీ వితండ వాదన చేస్తోందని, టీడీపీ చేసే ప్రయత్నాలు కేవలం కంటితుడుపు చర్యలేనని అన్నారు. ఈ విషయమై టీడీపీ న్యాయపరంగా చర్యలు తీసుకోవాలని భావించడం వారి హక్కు అని, దానికి తామెందుకు అడ్డు చెబుతామని అన్నారు. విలీనం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిన చర్య కనుక తమకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తే ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ పార్టీల నేతలు చాలా మంది తమతో టచ్‌లో ఉన్నారని సోము వీర్రాజు తెలిపారు. ఒకప్పుడు తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేసి, పంతం పట్టి గడ్డం పెంచిన వారే(సీఎం రమేశ్) నేడు బీజేపీలో చేరతామని కోరారని తెలిపారు. ఏపీ కోసం ఎంతో చేశామని కానీ ప్రజలు మాత్రం తమకు ఓట్లేయలేదన్నారు.

Leave a Reply