మూడు రాజధానులపై సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు…వైసీపీ ఎమ్మెల్యే వెరైటీ డిమాండ్

Share Icons:

తిరుపతి: రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై ఒక్కో నాయకుడు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే…మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ…రాజధాని మార్పు పై ఇంకా అధిష్టానంతో సంప్రదించలేదన్నారు. రాజధానిని తరలించకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పలు నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. తాము కూడా అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని రమేష్ తెలిపారు.

ఈ సందర్భంగా పౌరసత్వ బిల్లు గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చే వారికి పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ బిల్లుని కేంద్రం ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని..ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విధ్వంసాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం రమేశ్ మండిపడ్డారు.

ఇదిలా ఉంటే మూడు రాజధానులపై వైసీపీకి చెందిన అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అనంతపురం జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన వినిపించిన డిమాండ్‌ను కొంతమంది ఆమోదిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రాయలసీమకు ఒక్క హైకోర్టు సరిపోదని.. కర్నూలుకు హైకోర్టు ఇచ్చి.. అనంతపురంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని.. ఇందుకోసం అనంతపురంలోనూ అసెంబ్లీని నిర్మించాలని ఆయన కోరారు.

 

ఒక్క అమరావతిని లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే బదులు మూడు రాజధానుల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చని సిద్ధారెడ్డి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా వివిధ శాఖల అధిపతుల కార్యాలయాలను కూడా జిల్లాల స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

అటు రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదన చర్చ మొదలైన సమయం నుండి రాయలసీమ ప్రాంత నేతలు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలోనే ఆ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేసారు. తమ ప్రాంతంలోనే హైకోర్టు..రాజధాని ఏర్పాటు చేయాలని నినదించారు. మాజీ మంత్రి మైసూరా రెడ్డి లాంటి వారు సైతం హైకోర్టు బెంచ్ లు రెండు ఏర్పాటు చేసి..కర్నూలులో హైకోర్టు అని చెప్పినా ఉపయోగం లేదని వాదిస్తున్నారు. అయితే, రాజధాని తరలింపు..కొత్తగా హైపవర్ కమిటీ ఏర్పాటు తో ఆ కమిటీ చేసే సిఫార్సులకు అనుగుణంగా అసెంబ్లీ లో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ సమయంలో సభలో ఎమ్మెల్యేలు ఏ రకమైన అభ్యర్ధనలు ప్రభుత్వం ముందు ఉంచుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

 

Leave a Reply