నేడే కన్నడ విశ్వాస పరీక్ష…రాత్రి అంతా అసెంబ్లీలోనే గడిపిన బీజేపీ సభ్యులు…

BJP MLAs sleep in assembly, Governor orders floor test by 1.30 pm
Share Icons:

బెంగళూరు:

 

కర్ణాటక రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాతో మైనారిటీలో పడిపోయిన కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదురుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నిన్ననే విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా….స్పీకర్ ఈరోజుకి వాయిదా వేశారు.

 

అసలు సీఎం కుమారస్వామి కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైడ్రామా నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ సభ్యులు, విశ్వాసపరీక్షను వాయిదా వేసేందుకు పన్నాగాలు పన్నుతోందని బీజేపీ సభ్యులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో సభ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.

 

అంతకుముందు, కాంగ్రెస్ సభ్యుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ, తమ సభ్యులను అసెంబ్లీకి రానీయకుండా బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు కలిసే ప్రయాణం చేశారని, వారిలో ఒకరైన శ్రీమంత్ పాటిల్ ఆసుపత్రిలోని స్ట్రెచర్ పై కన్పించారంటూ అందుకు సంబంధించిన ఓ ఫొటోను స్పీకర్ కు చూపించారు. మిగిలిన వారు ఏమయ్యారో తెలియదని, తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్ ను కోరారు.

 

ఈ పరిణామాల నేపథ్యంలో స్పీకర్ సభ రేపటికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కర్ణాటకలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక సీఎం కుమారస్వామికి ఆ రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా ఓ లేఖ రాశారు. రేపు మధ్యాహ్నం 1.30 గంటల లోపు కాంగ్రెస్-జేడీఎస్ లు వారి మెజార్టీ నిరూపించుకోవాలని సూచించారు.

 

ఇక దీనికి తోడు నిన్న విశ్వాస పరీక్ష జరగకపోవడంతో…బీజేపీ నేతలు అసెంబ్లీలో ఉండే నిరసన తెలియజేశారు. ఎట్టి పరిస్తితిల్లోనూ బల నిరూపణ జరగాలని పట్టుబట్టి రాత్రి అంతా అసెంబ్లీలోనే గడిపారు. మరి చూడాలి ఈరోజు విశ్వాస పరీక్ష జరుగుతుందా….లేక మళ్ళీ వాయిదా పడుతుందో…

Leave a Reply