రూటు మార్చిన జీవీఎల్….

BJp leader gvl criticizes telangana congress leaders
Share Icons:

హైదరాబాద్, 20 అక్టోబర్:

ఎప్పుడు ఏపీ టీడీపీ నేతలనీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఈసారి రూట్ మార్చారు. ఈసారి తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ నేతలనీ లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.

ఈరోజు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. ఆదాయపు పన్ను శాఖ అధికారుల విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి బయటకొచ్చి హీరోలా ఫోజులిచ్చారని విమర్శించారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిపై ఉందన్నారు.
రేవంత్ రెడ్డి వంటి అవీనీతి నేతలకు కాంగ్రెస్ పార్టీలో మంచి డిమాండ్ ఉందని, ఇలాంటి నేతలతో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాస్తా ఇమ్మోరల్ నేషనల్ కరప్ట్ కాంగ్రెస్(అనైతిక, అవినీతి కాంగ్రెస్) పార్టీగా తయారయిందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి వ్యవహారాలు తెలిసే కాంగ్రెస్ పార్టీ ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాను కట్టబెట్టినట్లు తాము భావిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీలపై నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో భూకబ్జా సహా పలు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ రోజు తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ రేవంత్ రెడ్డిపై యాక్షన్ తీసుకునే బదులు ఆయన దగ్గర క్లాసులు తీసుకునేలా ఉన్నారని జీవీఎల్ ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ సచ్ఛీలుల పార్టీ అని ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మామాట: విమర్శలు చేయడంలో ముందున్న జీవీఎల్…..

Leave a Reply