మోడీ-అమిత్ షాలపై బీజేపీ మాజీ నేత ఫైర్: ఒకరు దుర్యోదనుడు-మరొకరు దుశ్శాసనుడు

Share Icons:

ఢిల్లీ: ఇటీవల దేశంలో ఎన్‌ఆర్‌సీ,సీఏఏలపై కాంగ్రెస్,తుక్డె-తుక్డె గ్యాంగ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే పౌరసత్వ చట్టాలకు వ్యతిరేకంగా ఆయా ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలకు వీరే బాధ్యులని అమిత్ షా నిందించారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న విపక్షాలను టార్గెట్ చేసేందుకు అమిత్ షా తుక్డె-తుక్డె గ్యాంగ్ అని విమర్శలు సంధిస్తున్న నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా.. మోడీ,అమిత్ షాలను దుర్యోదన,దుశ్వాసనుడితో పోల్చారు.

ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రమాదకర తుక్డె-తుక్డె గ్యాంగ్‌లో ఇద్దరే ఇద్దరు ఉన్నారన్నారు. అందులో ఒకరు దుర్యోదనుడు అని,మరొకరు దుశ్వాసనుడు అని చెప్పారు. వాళ్లిద్దరి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోదీ, అమిత్ షాలను ఉద్దేశించి యశ్వంత్ సిన్హా పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ 134వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘దేశాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కాపాడండి’ అనే సందేశంతో శనివారంనాడు దేశవ్యాప్త ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మీడియాతో రాహుల్ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దు చర్య కంటే సీఏఏతో మరింత విపత్తు ఏర్పడుతుందని, పౌరసత్వాన్ని నిరూపించుకునే విషయంలో పేద ప్రజలకు ఇక్కట్లు తప్పవని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం బీదలపై పన్నులాంటిదని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) బీద ప్రజలపై పన్ను అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా సీఏఏను ‘పెద్ద నోట్ల రద్దు-2’ (నోట్ బందీ-2)గా అభివర్ణించారు. 2016లో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సీఏఏను ఆయన పోల్చారు.

అటు రాహుల్ గాంధీని ‘ఈ సంవత్సరపు అబద్ధాల పుట్ట’గా కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ అభివర్ణించడాన్ని లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ నేత అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా తిప్పికొట్టారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)ని ‘ఈ సంవత్సరపు జోకర్’ (జోకర్ ఆఫ్ ది ఇయర్)గా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలాడుతున్నారో, రాహుల్ గాంధీ అబద్ధాలకోరో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమేనా? అని ప్రకాష్ జవదేకర్‌కు సవాలు విసిరారు.

 

 

Leave a Reply