తిరుపతి, మే 11,
చేదుగా ఉంటుందన్న కారణంగా చాలా మంది కాకరకాయను ఇష్టపడరు. చేదుగా ఉన్నా…ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వైద్యులు కూడా ఆరోగ్యానికి మేలుచేసే కాకరకాయలను రెండు వారాలకు ఒక్కసారైనా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కాకరకాయలను ఉడికించుకుని, పులుసు పెట్టుకుని, బెల్లము పెట్టి కూరగా చేసుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది.
కాకరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఏ, విటమిన్ సీ ఉంటాయి. కాకరతో జలుపు, దగ్గు, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలకు నివారణ లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత సమస్యలకు కాకర చక్కగా పనిచేస్తుంది.
బీపీని కంట్రోల్లో ఉంచేందుకు కాకర ఉపయోగపడుతుంది. ఆరోగ్యానికి హాని చేసే కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులతో పాటు క్యాన్సర్, మలబద్ధకం, లివర్, మూత్రపిండాల సమస్యల నివారణకు కూడా కాకర మంచి ఆహారం. మధుమేహగ్రస్తులు కాకరకాయను తమ ఆహారంలో చేర్చుకుంటే ఇన్సులిన్ స్థాయిల్లో తేడా రాకుండా నియంత్రణలో ఉంచుతూ రక్తంలోని చెక్కర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
ఇంకా, బరువు తగ్గాలనుకునే వారికి కాకరకాయ బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరను మన వంటింట్లోకి ఆహ్వానిద్దాం.
మామాట: పైకి చేదుగా ఉన్నా, మంచే చేస్తాగా…