త్రిమూర్తుల ప్రాణత్యాగానికి తొంభై యేళ్ళు

Share Icons:
ఆ ముగ్గురు జ్వలించే నిప్పుకణికలు
భగత్ సింగ్,  సుఖ్ దేవ్, రాజ్ గురు

ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగారు.. కన్నభూమి ఒడిలోనే ఒదిగారు.. స్వతంత్ర్య భారత విముక్తి కోసం పాటుపడ్డారు.. మండే అగ్ని గోళంలా తెల్లదొరతనాన్ని ప్రశ్నించారు. జ్వలించే నిప్పుకణికల్లా బ్రిటీషోడి అరాచకాలను అడ్డుకున్నారు. నేటి తరానికి ఆదర్శమయ్యారు… విప్లవ తోటలో విరిసిన కుసుమాలు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్. భగత్ సింగ్ పేరు వింటే ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

భారతదేశ చరిత్రలో 1931 మార్చి 23 ఓ విషాదం దినం. దేశం కోసం ఆ ముగ్గురు ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారు. భారతదేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించి అమరులయ్యారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ ముగ్గురు యోధులకు ఈ ఒక్కరోజే కాకుండా ప్రతిరోజూ నివాళులు అర్పించాలి. 1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ ప్రభుత్వం పై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి ‘జె.పి. సాండర్స్’ ను హతమార్చినందుకు 1931 మార్చి 23న   ఉరిశిక్షకు గురయ్యారు.

ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలు జరిగేది కాదు. మృత దేహాలను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు. మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళి సట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు.

భగత్ సింగ్ ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతం ఖత్కర్ కలాన్ గ్రామంలో 1907, సెప్టెంబర్ 28న జన్మించారు. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్ పై విపరీతంగా ప్రభావం చూపింది. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్ర్య పోరాటంలో మొదటిసారి పాల్గొన్నారు. ప్రభుత్వ పుస్తకాలు, దుస్తులను తగులబెట్టారు. భగత్ సింగ్ ఈ పేరు వింటేనే, ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. 23 ఏళ్ల వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి   ఉరికొయ్యను ముద్దాడిన వీరుడు భగత్ సింగ్. ఆయన తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి  దయానంద సరస్వతికి అనుచరుడు. హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్న ఆయన ప్రభావం భగత్ పై బాగా ఉండేది. 12 యేళ్ళ వయసులో ఉన్నప్పుడు  1919లో జరిగిన జలియన్ వాలా బాగ్ ఘటన.. భగత్ లో బ్రిటిష్ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది. యుక్త వయసుకు వచ్చాక లాహోర్ లోని నేషనల్ కాలేజీలో చేరారు. అప్పుడే ఆయనకి పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన భగత్.. “నవజవాన్ భారత సభ” అనే సంఘంలో చేరారు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్ర్యోద్యమ సాధనకు పురికొల్పారు. అనంతరం హిందూస్తాన్ గణతంత్ర సంఘంలోనూ చేరారు. అక్కడే భగత్ సింగ్ కి సుఖ్ దేవ్, హరి శివరాం రాజ్ గురు  పరిచయమయ్యారు.

సుఖ్ దేవ్ థాపర్ మే 15, 1907లో జన్మించాడు. సుఖదేవ్ హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే సంస్థలో ముఖ్యమైన నాయకుడు. లాహోర్ నేషనల్ కాలేజిలో భారత పురాతన ఔన్నత్యాన్ని అధ్యయనం చేయడానికి, ప్రపంచ విప్లవ పరిణామాలు పరిశీలించడానికి ఒక అధ్యయన కేంద్రాన్ని (స్టడీ సర్కిల్) ప్రాంభించాడు. తన సహచరులైన భగత్ సింగ్, రామచంద్ర, భగవతీ చరణ్ వోహ్రా లతో కలిసి లాహోరులో “నవ జవాన్ భారత సభ” ప్రారంభించారు. దేశ స్వాంతంత్ర్యానికి యువతను ఉత్తేజితులను చేయడం, ప్రజలలో హేతువాదాన్ని పెంపొందించడం, మతవైషమ్యాలను నిరోధించడం, అంటరానితనాన్ని అరికట్టడం ఆ సంస్థ ఆశయాలు. పండిట్ రామప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర ఆజాద్‌ల ప్రభావం సుఖదేవ్‌పై బలంగా ఉంది. ఖైదీలపట్ల చూపుతున్న అమానుష విధానాలకు వ్యతిరేకంగా 1929లో జరిగిన నిరాహార దీక్షలో సుఖదేవ్ పాల్గొన్నారు.

హరి శివరాం రాజ్ గురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1908 ఆగస్టు 24 న పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఖేద్ గ్రామం లో పార్వతి దేవి, హరినారాయణ రాజ్‌గురు దంపతులకు జన్మించారు.  అతనికి ఆరేళ్ల వయసులో తండ్రి మరణించారు. కుటుంబ బాధ్యత అతని అన్నయ్య దిన్‌కర్ మీద పడింది. అతను ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత పూనాలోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువుపూర్తి చేసారు. భారత స్వాతంత్ర్య ఉద్యమ, ఉద్యమకారుడుగా ఎదిగి భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి చెందారు.

అనతి కాలంలోనే “నవ జవాన్ భారత సభ” నాయకులయ్యారు. బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అది ఫిబ్రవరి, 1928వ సంవత్సరం.. సైమన్ కమీషన్ భారతదేశంలో  అడుగుపెట్టింది.. ఆ కమీషన్ ముఖ్యోద్దేశ్యం, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద నివేదిక ఇవ్వడం… ఐతే ఆ కమిటీలో ఒక్క భారతీయుడు కూడా లేడు.. అందుకు వ్యతిరేకంగా, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి. కమిటీ లాహోరులో పర్యటిస్తున్నప్పుడు, లాలాలజపతి రాయ్ దానికి నిరసనగా, ఒక శాంతియుత ప్రదర్శన చేపట్టారు..కానీ పోలీసులు అత్యుత్సాహంతో, దాంట్లో పాల్గొంటున్న వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేశారు.. ఆ దెబ్బలకి లాల లజపతి రాయ్ చనిపోయారు..

ఈ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షైన, భగత్ సింగ్, లజపతి రాయ్ ని చంపిన పోలిస్ అధికారిని చంపుతానని ప్రతిజ్ఞ చేశారు.. తన స్నేహితులైన శివరామ రాజగురు, జై గోపాల్, సుఖదేవ్ థాపర్ తో కలిసి ప్రణాళిక రచించారు.. వాళ్ళ పధకం ప్రకారం, జైగోపాల్ ఆ అధికారిని చూసి, భగత్ సింగ్ కి సైగ చేయాలి.. అయితే జైగోపాల్ తప్పిదం వల్ల, అసలు అధికారి బదులు, వేరే వాళ్ళని కాల్చేశాడు భగత్ సింగ్… పోలీస్ అధికారిని చంపిన తరువాత, భగత్ సింగ్ మీద నిఘా ఎక్కువైంది.. దాంతో, తప్పనిసరి పరిస్థితుల్లో, మారువేషంలో సంచరించ సాగాడు.. కానీ జైల్లో ఉన్నప్పుడు కూడా, భగత్ సింగ్ ఉద్యమాలని చేయడం ఆపలేదు.. బ్రిటీష్ ఖైదీలకి, భారతీయ ఖైదీలకి చూపిస్తున్న అసమానతలని పారద్రోలడానికి, 63 రోజుల పాటు, నిరాహార దీక్ష చేశారు.. 8 ఏప్రిల్ 1929న కేంద్ర శాసనసభపై సింగ్ ఆయన సహచర యోధులు బాంబు విసిరి, “ఇంక్విలాబ్ జిందాబాద్! ” అని నినదించారు.  దానితో వారి పేరు భారత దేశం మొత్తం మారుమ్రోగింది.. ఆ తర్వాత ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినదించారు.

మార్చి 23, 1931 రాత్రి 7.30 గంటలకి విప్లవ యోధులు సుఖ్ దేవ్, రాజ్ గురులతో పాటూ అసువులు బాశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ ముగ్గురిని ఉరి తీసింది. ఉరికొయ్య ముందు నిల్చుని కూడా వారు ఏ మాత్రం భయపడలేదు. ఆ ధైర్యమే ప్రవాహంలా మారి తరువాతి తరాలకు ఆదర్శమైంది. ఈ ముగ్గురు ధైర్య శాలులు నిండు యవ్వనంలో ఉండి, వారి ప్రాణాలను త్యాగం చేశారు. వారి తదనంతర తరాలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలగాలనే ఆశయంతో వారు అలా చేశారు.

 – నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply