ప్రొ కబడ్డీలో బెంగాల్ జోరు…యూ ముంబాపై ఘనవిజయం…

Bengal Warriors vs U Mumba in Kolkata: Bengal Beat Mumbai 29-26
Share Icons:

 

కోల్ కతా:

ప్రొ కబడ్డీ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది. అన్నీ జట్లు టఫ్ ఫైట్ ఇస్తూ..హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి కూడా ఆసక్తికరమైన మ్యాచ్ లు జరిగాయి. అందులో మొదటిగా బెంగాల్ వారియర్స్-యూ ముంబా మధ్య టఫ్ ఫైట్ జరిగింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ 29-26తో యు ముంబా పై గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

ఆట మొదట్లోనే అర్జున్ సూపర్ రైడ్ ద్వారా 3 పాయింట్లు సాధించడంతో ముంబై జట్టు శుభారంభం వేసింది. అయితే కాసేపటి తర్వాత బెంగాల్ కూడా ఖాతా తెరిచి 3-3తో స్కోరు సమం చేసింది. ఆరంభంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగింది. అయితే జోరు పెంచిన బెంగాల్ వరుస పాయింట్లు సాధించి ప్రత్యర్థిని ఆలౌట్ చేయడంతో 16-8తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఇక తిరిగి పుంజుకున్న యు ముంబా ఆధిక్యాన్ని తగ్గించే పనిలో పడటంతో ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి బెంగాల్ 16-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. రెండో సగంలో కూడా పట్టు నిలుపుకున్న బెంగాల్ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చింది. అయితే మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. ఒక పాయింట్ మాత్రమే వెనుకంజలో ఉన్న ముంబై మ్యాచ్‌ను డ్రా చేసుకునేలా కనిపించింది. కానీ, అప్పటి వరకు ఆకట్టుకున్న రైడర్ అర్జున్ ప్రత్యర్థి కోర్టులో సూపర్ ట్యాకిల్ కావడంతో యు ముంబాకు ఓటమి తప్పలేదు.

వారియర్స్ తరఫున సుఖేశ్ హెగ్డే 8, మణిందర్ 7 పాయింట్లు సాధించారు. ముంబా నుంచి అర్జున్ దేశ్వాల్ 15 పాయింట్లుతో మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు. ప్రస్తుతం లీగ్‌లో 15 మ్యాచ్‌లు ఆడిన బెంగాల్ 8 విజయాలు, 4 పరాజయాలు, 3 డ్రాతో 53 పాయింట్లు ఖాతాలో వేసుకొని రెండో స్థానంలో నిలువగా.. 15 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 7 ఓటములు ఒక డ్రాతో యు ముంబా (43 పాయింట్లు) పట్టికలో ఐదో ప్లేస్‌లో ఉంది. అటు 14 మ్యాచ్‌లు ఆడిన దబాంగ్ ఢిల్లీ 11 విజయాలు, 2 పరాజయాలు, 1 డ్రాతో 59 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్ లో ఉంది.

ఇక రెండో మ్యాచ్ లో హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 32-32తో డ్రాగా ముగిసింది. ఈ డ్రాతో యూపీ పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి చేరుకోగా, జైపూర్ ఏదో స్థానానికి జారింది.

 

Leave a Reply