కొత్త కోచ్ ఎంపికలో కోహ్లీకి ఎలాంటి అధికారాలు ఉండవు….

kohli and bumra rest for west indies tour
Share Icons:

ముంబై:

 

టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో..బీసీసీఐ కొత్త కోచ్ కోసం వేట మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే గతంలో మాదిరి కోచ్ ఎంపికలో ఈసారి కెప్టెన్ కోహ్లీ పాత్ర ఏం ఉండదని బీసీసీఐ వర్గాలంటున్నాయి. కపిల్ దేవ్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ మాత్రమే భారత జట్టు కోచ్ ను ఎంపిక చేస్తుందని, ఇందులో కోహ్లీ సహా ఎవరి ప్రమేయం ఉండదని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

 

కపిల్ దేవ్ కమిటీ ఎంపిక చేసిన కొత్త కోచ్ పై కోహ్లీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేడని సదరు అధికారి స్పష్టం చేశారు. కోహ్లీ ఇష్టాయిష్టాలతో కపిల్ దేవ్ కమిటీకి పనిలేదని వెల్లడించారు. గతంలో అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్ గా పనిచేసిన కాలంలో కోహ్లీ అనేక అభ్యంతరాలు వెలిబుచ్చాడు. కుంబ్లే వద్దంటూ రవిశాస్త్రికి ఓటేశాడు. ఈసారి మాత్రం బీసీసీఐ కెప్టెన్ గా కోహ్లీ అధికారాలను పరిమితం చేసినట్టు కనిపిస్తోంది. ఈసారి కోహ్లీ అభిప్రాయాలను కోచ్ ఎంపిక కమిటీ పట్టించుకోకపోవచ్చని, టీమిండియా కోచ్ కు అసిస్టెంట్లను కూడా ఈ కమిటీనే ఎంపిక చేస్తుందని తెలిపారు.

 

ఇదిలా ఉంటే వచ్చే నెలలో జరిగే కరీబియన్ టూర్ కోసం రేపు టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉండగా, సెలెక్షన్ కమిటీ సమావేశం చివరి నిమిషంలో వాయిదా పడినట్టు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం విరాట్ కోహ్లీనే. సాధారణంగా జట్టు ఎంపిక సమయంలో కెప్టెన్ కూడా సెలెక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటాడు. విండీస్ తో టూర్ కోసం టీమిండియాను ఎంపిక చేసేందుకు రేపు ముంబయిలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన సెలెక్షన్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ ఆడిన అనంతరం కెప్టెన్ కోహ్లీ ఇవాళే స్వదేశానికి చేరుకున్నాడు.

 

దాంతో రేపు కోహ్లీ సెలెక్షన్ సమావేశానికి హాజరయ్యే పరిస్థితి కనిపించడంలేదు. చేసేదేమీలేక సెలెక్టర్లు తమ సమావేశాన్ని వాయిదా వేసుకున్నట్టు సమాచారం. ఆదివారం కెప్టెన్ కోహ్లీతో కలిసి సెలెక్టర్లు విండీస్ టూర్ కు జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి.

Leave a Reply