రిజర్వేషన్ల రాజకీయం: బీసీల కోటాపై సుప్రీంకు వెళ్తారా…కుదించేస్తారా!

Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశం పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల నేతలు బీసీ రిజర్వేషన్ల విషయంలో గొడవపడుతున్నారు. అసలు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించడం వెనుక ఇతర కారణాలతో పాటు కుల సమీకరణాల పాత్ర ఎంతో ఉంది. గతంలో టీడీపీకి తప్ప మిగతా పార్టీలకు ఓటు వేసేందుకు ఇష్టపడని ఎన్నో కులాలు జగన్ కు తొలిసారిగా అండగా నిలిచాయి. ఇందులో బీసీలది ప్రధాన పాత్ర. దశాబ్దాలుగా బీసీలకు అండగా నిలిచిన బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో టీడీపీ విఫలం కావడంతో తొలిసారి జగన్ ఇచ్చిన హామీలను వారు నమ్మారు.

వైసీపీ అధికారం చేపట్టాక బీసీలకు తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. వారిని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు 50 శాతం కోటాతో రిజర్వేషన్లు కల్పించారు. బీసీలకు క్యాబినెట్ తో పాటు మిగతా పదవుల్లో అవకాశమిచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేదు. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చిన ఎన్నికలు 9 నెలల తర్వాత సాకారం అయ్యే పరిస్దితి. అయితే ఇక్కడే జగన్ ఓ తప్పు చేశారు.

50 శాతం మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీంకోర్టు, హైకోర్టుల ఉత్తర్వులను పక్కనబెట్టి బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచారు. ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దాన్ని 9.85 శాతం మేర తగ్గించేందుకు సిద్దమయ్యారు. ఇప్పుడు ఇదే వివాదాస్పమవుతోంది. తమ బీసీ ఓటు బ్యాంకును జగన్ లాగేసుకున్నాడన్న కోపంతో ఉన్న చంద్రబాబు సహా టీడీపీ నేతలు బీసీ రిజర్వేషన్ల తగ్గింపును రాజకీయం చేయడం మొదలుపెట్టేశారు.

బీసీ రిజర్వేషన్ల తగ్గింపులో సుప్రీంకోర్టు ఆదేశాలు పట్టించుకోని జగన్ సర్కారు… ఇప్పుడా విషయాన్ని కోర్టు పరిధిలో ఉన్న అంశమని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ఓసారి రిజర్వేషన్లు ప్రకటించి దాన్ని తగ్గించడం లేదా తొలగించడం సాధ్యం కాని పని. అలా చేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారాన్ని కీలకమైన స్ధానిక ఎన్నికల సమయంలో జగన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి బీసీల రిజర్వేషన్లు కోసం వైసీపీ సుప్రీ కోర్టుకు వెళుతుందా, లేక తగ్గించేసి ఎన్నికలు నిర్వహిస్తుందో చూడాలి.

 

Leave a Reply