నేడు రేఖాచిత్ర ఋషి ‘బాపు’ జయంతి.

Share Icons:

నేడు (డిసెంబర్-15) మన తెలుగింటి వ్యంగ్యచిత్రకారుడు, కళాత్మక చిత్ర దర్శకుడు, రేఖాచిత్ర ఋషి ‘బాపు’ జయంతి.

జగద్విఖ్యాతుడైన మన తెలుగింటి రేఖాచిత్ర ఋషి బాపు
బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. ఈయన వేణుగోపాలరావు, సూర్యకాంతమ్మ దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా లోని నర్సాపురం నందు 15.12.1933న జన్మించాడు. 1955వ సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి న్యాయవాదిగా పట్టా పుచ్చుకున్నాడు. కానీ, అడుగులు ఆ రంగం వైపుకు పడలేదు. అదే సంవత్సరంలో నాటి ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’లో వ్యంగ్యచిత్రకారునిగా కొలువుదీరాడు. బాపు కొంతకాలం జె. వాల్టర్ థామ్సన్ సంస్థలోనూ, ఎఫిషియంట్ పబ్లికేషన్స్, ఎఫ్.డి. స్టీవార్ట్స్ సంస్థలోనూ పనిచేశాడు.
బాపు చిత్రకళ ఒక విషయానికి లేక అంశానికి పరిమితం కాలేదు. 1945నుండి బాపు అనేక రేఖాచిత్రాలను, వ్యంగ్యచిత్రాలను, పత్రికలకు ముఖచిత్రాలను, పుస్తకాలకు ముఖచిత్రాలను, శీర్షికలు-సీరియల్స్, కథలకు బొమ్మలను, విషయానుగుణ చిత్రాలను, మరెన్నో రేఖా విన్యాసాలను పుంఖానుపుంఖాలుగా సృజిస్తూనే వున్నాడు. కొత్త-పాత-ప్రసిద్థ అన్నతేడా లేకుండా రచయితలందరూ తమ పుస్తకాలకు ‘బాపూ గీత’ ముఖచిత్రంగా వుండాలని కోరుకుంటారు. చరిత్ర, పురాణాలు, భక్తి, రక్తి, జీవితము, జీవనము, సంస్కృతి, రాజకీయము, సినిమా తదితర ఎన్నో రంగాలలో బాపు గీతలు రాసులు రాసులుగా వన్నె తగ్గకుండా వాసి కెక్కాయి. ఆయన చిత్రాలతో వున్న శుభాకాంక్షల పత్రాలు (గ్రీటింగ్ కార్డ్స్), వివాహ శుభలేఖలను కళాప్రియులు కోరి ఏరుకుంటారు. బాపు తన సహచరుడు, ప్రాణమిత్రుడు అయిన ముళ్లపూడి వెంకటరమణతో కలసి రూపొందించిన ‘బుడుగు’ పుస్తకం తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇందులోని ‘బుడుగు’ మరియు ‘సీగానపెసూనాంబ’ పాత్రలు (బొమ్మల రూపురేఖలు-హావభావాలు) తెలుగు పాఠకుల మదిలో పదిలంగా నిలచి పోయాయి.
బాపు రాత కూడా అంతే. ఇంతవరకూ తెలుగునాట ఎవరి చేతి వ్రాతకూ ఆ ప్రాముఖ్యత లభించలేదు. తెలుగులో బాపు అక్షరమాల (ఫాంట్స్) ఎన్నో డి.టి.పి. సంస్థలు, ప్రచురణా సంస్థలూ ఎక్కువగా మకుటాలకు, ఉపమకుటాలకు, ఉపవాక్యాలకు ప్రత్యేకంగా వాడుతున్నాయి.
ఇంకా బాపు నవరసాలు, అష్టవిధనాయికలు, భారతీయ నృత్య భంగిమలు, బొమ్మల రామాయణం, జనార్ధనాష్టకం, అన్నమయ్య పాటలు, తిరుప్పావై వంటి ప్రత్యేక అంశాలపై గీచిన చిత్రమాలికలు కళాభిమానులను అలరించాయి. ఆయన చిత్రాలు దేశవిదేశాలలో ప్రదర్శింపబడి చిత్రప్రేమికుల, విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి. అందుకుంటూనే వున్నాయి..
పొదుపుగా గీతలు వాడటం.. ప్రవహించినట్లుండే ఒరవడి.. సందర్భానికి తగిన భావము.. చెక్కుచెదరని తెలుగుదనం బాపూ గీతలకు మూలధనం. ఆ ఒరవడిని అనుసరిస్తున్న, అనుకరిస్తున్న శిష్యప్రశిష్యులు, ఆరాధ్యులు అయిన చిత్రకారులు తెలుగు నాట వందల సంఖ్యలో వున్నారనడం, అతిశయోక్తి కాదు. అక్షర సత్యం.
బాపు చిత్రకళలోనే కాదు చలన చిత్రరంగంలోనూ రాణించాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందడం తోపాటు అచ్చతెలుగు సినిమాకు మైలురాళ్లుగా చలనచిత్ర చరిత్రలో నిలచిపోయాయి.
చిత్రకారునిగా సంతకం లేకపోయినా, దర్శకునిగా తెరపై పేరు లేకపోయినా సరే, ఇది గీసింది బాపు.. ఇది తీసింది బాపు అని చప్పున గుర్తించ గలిగేంతటి విలక్షణమైన శైలి ఆయనది.
మన తెలుగు నాట ఏ అందమైన అమ్మాయిని చూసినా, మరో చిత్రరూపాన్ని చూసినా ‘బాపుబొమ్మ’ అని ఉదహరించడం పరిపాటి అయిపోయింది. అంతటి ఖ్యాతి గడించాయి బాపు బొమ్మలు.
కొంటె బొమ్మల బాపు
కొన్ని తరముల సేపు
గుండె ఊయలలూపు
ఓ కూనలమ్మా!
-అని ఏనాడో తన కూనలమ్మ పదాలలో బాపుకు పద్యాభిషేకం చేశాడు సుప్రజాకవి ఆరుద్ర. ఆయన అన్నట్లుగానే క్షణముల సేపు గాదు కొన్ని తరముల సేపు సుస్థిరంగా నిలచి వుంటాయి బాపు గీతలలోని అందాలు మరియు అసామాన్యమైన రూపురేఖలు. ఇలా బాపు గీతల వైనాలను వర్ణించుకుంటూ పోతే కలంలో ఇంకు ఇంకి పోవడం తప్ప అవి సోయగంగా సాగుతూనే వుంటాయి.
31.08.2014న భౌతికంగా ఆయన మనల్ని వీడినా, ఆ సంతకం ఏనాటికీ మన మదిలోనుండి చెరగిపోదు. కనుక, సేకరణలో లభించిన ఆ వంపుసొంపులను కొన్నింటిని తనివి తీరగ చూసి తరిద్దాం..

ఈ సందర్భంగా వారి బొమ్మల అందాలను, వ్యగ్యచిత్ర వైభవాన్ని, చలనచిత్రముల జాబితాను ఒకపరి తిలకించి తరిద్దాం. వరుసగా 1 నుండి 63 పుటల్లో బాపు బొమ్మల సమాహారం.

+59

Leave a Reply