బ్యాంకు ఉద్యోగుల సమ్మె

Share Icons:
కొత్త ఢిల్లీ, జనవరి 7 ,
బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పడుతున్నారు. దీంతో పలు చోట్ల బ్యాంక్ సేవలు నిలిచిపోయే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఉద్యోగుల వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 8-9 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు కొన్ని బ్యాంక్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) యూనియన్లు రెండు రోజుల సమ్మె వివరాలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)కు తెలియజేశాయని ఐడీబీఐ బ్యాంక్ .. బీఎస్ఈకి తెలియజేసింది.
సమ్మె జరిగితే బ్యాంక్ పలు బ్రాంచ్‌లలో కార్యకలాపాలకు అడ్డంకులు ఏర్పడవచ్చని అలహాబాద్ బ్యాంక్ పేర్కొంది. అయితే కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. జనవరి 8-9 తేదీలలో సమ్మె జరిగితే బ్యాంక్ పలు శాఖలలో సేవలకు అంతరాయం ఏర్పడవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. సమ్మె జరిగితే తమ ఉద్యోగులు కూడా ఇందులో పాల్గొనవచ్చని ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ తెలిపింది. ఇదే జరిగితే పలు బ్రాంచ్‌లలో బ్యాంక్ సేవలు నిలిచిపోవచ్చని పేర్కొంది.
కాగా సమ్మెకు పిలుపునిచ్చిన పది కేంద్ర కార్మిక సంఘాలలో ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఏఐసీసీటీయూ, యూటీయూసీ, టీయూసీసీ, ఎల్‌పీఎఫ్, ఎస్‌‌ఈడబ్ల్యూఏ ఉన్నాయి. ఈ సంఘాలు 12 డిమాండ్లను కేంద్రం ముందుంచాయి.
మామాట: వినియోగదారుల కష్టాలు ఎవరికీ పట్టవా… 

Leave a Reply