చెలరేగిన షకీబ్….విండీస్‌ని చిత్తు చేసిన బంగ్లా పులులు…

Share Icons:

లండన్, 18 జూన్:

బంగ్లాదేశ్ జట్టు తాము పసికూనలు కాదు అని మరోసారి రుజువు చేసింది. తమదైన రోజున ఎలాంటి జట్టునైనా మట్టికరిపిస్తామని చూపించింది. వరల్డ్ కప్ ఆరంభంలో దక్షిణాఫ్రికా జట్టుకు షాక్ ఇచ్చిన బంగ్లా జట్టు….తాజాగా విండీస్ జట్టుని చిత్తు చేసింది. బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.

మొదట విండీస్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు చేసింది. షై హోప్ (121 బంతుల్లో 96; 4 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఎవిల్ లెవీస్ (67 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హెట్‌మైర్ (26 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో అలరించారు. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్, సైఫుద్దీన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనలో స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (99 బంతుల్లో 124 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ సెంచరీకి.. లిటన్ దాస్ (69 బంతుల్లో 94 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు తోడవడంతో బంగ్లా 41.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలవడంతో పాటు 2 వికెట్లు పడగొట్టిన షకీబుల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ మ్యాచ్‌తో బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరువేల పరుగుల మైలురాయిని దాటాడు. వన్డేల్లో వేగంగా 200 వికెట్లతో పాటు 6000 పరుగులు చేసిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు.

ఇక రోహిత్ శర్మ, కోహ్లీ, బెయిర్‌స్టో, జాసన్ రాయ్, వార్నర్, స్మిత్, ఫించ్, గప్టిల్, విలియమ్సన్, డికాక్, డుప్లెసిస్, గేల్ వంటి గొప్ప గొప్ప బ్యాట్స్‌మెన్ ఆడుతున్న ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల జాబితాలో షకీబ్ అల్ హాసన్ నిలవడం టాప్‌లో నిలవడం విశేషం.

 

Leave a Reply