హైదరాబాద్, 19 నవంబర్:
ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్..ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పార్టీలో చేరిన వెంటనే.. ఓ మీడియా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు రాజేంద్రనగర్ టికెట్ దక్కడం ఖాయమని చెప్పుకున్నారు. ఇక అక్కడితో ఆగకుండా… తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం కూడా ప్రాక్టీస్ చేశారు.
తీరా..సీన్ కట్ చేస్తే.. ఇటీవల కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో.. బండ్లకు చోటు దక్కలేదు. ఆయన ఆశించిన రాజేంద్ర నగర్ సీటు.. పొత్తులో భాగంగా టీడీపీకి దక్కింది. దీంతో.. ఒక్కసారిగా బండ్ల గణేష్ డీలా పడిపోయాడు. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేశ్‌కు శుభవార్త తెలిపింది.
ఆయనకు పార్టీ టికెట్ ఇవ్వకున్నా.. ఓ ప్రముఖ పదవిని కట్టబెట్టింది. బండ్ల గణేష్‌ని తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమిస్తూ.. ఉత్వర్వులు జారీ చేసింది. ఈ లెటర్ని బండ్ల గణేష్‌కి కూడా పంపించారు.
మామాట: కాంగ్రెస్‌లో ఏ సమయంలో ఏ పదవి దక్కుతుందో చెప్పలేములే..