బాబుకు అదిరిపోయే షాక్….వైసీపీలోకి బాలయ్య ఫ్రెండ్…

Share Icons:

అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. అధికార వైసీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రహమాన్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరగా..కడప జిల్లాకు చెందిన కొందరు నేతలు నేడో రేపో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక, తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ నేత..మాజీ ఎమ్మెల్యే..బాలకృష్ణ సన్నిహితుడు కదిరి బాబురావు తెలుగు దేశం వీడి, వైసీపీలో చేరనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు..సినీ హీరో బాలకృష్ణ కు అత్యంత సన్నిహితుడు అయిన కదిరి బాబూరావు 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సైతం ఆయనకు టీడీపీ టిక్కెట్ దక్కినా..నామినేషన్ లో సాంకేతిక సమస్యల కారణంగా అది తిరస్కరణకు గురైంది. సమయం మించి పోవటంతో ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే, తిరిగి బాలకృష్ణ సిఫార్సుతో 2014 ఎన్నికల్లో కనిగిరి నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి మధుసూధనరావు పైన 7207 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

ఇక, 2019 ఎన్నికల్లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కనిగిరి నుండే తిరిగి అవకాశం ఇవ్వాలని మొర పెట్టుకున్నా..పార్టీ అధినేత చంద్రబాబు కనిగిరి సీటును మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహా రెడ్డికి కేటాయించారు. బాబూరావును దర్శి నుండి బరిలోకి దింపారు. అప్పుడు కూడా బాలకృష్ణ చెప్పటంతో కాదనలేక బాబూరావు పోటీకి దిగారు. అయితే, ఆయన ఓడిపోయారు. దీంతో..అప్పటి నుండి ఆయన పార్టీలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

టీడీపీ నేత కదిరి బాబూరావు తనకు రాజకీయాల కంటే బాలకృష్ణ తో సంబంధాలు ముఖ్యమని గతంలోనే స్పష్టం చేసారు. అయితే, 2019 ఎన్నికల్లో టీడీపీ పరాజయం తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన సమయం నుండి బాబూరావు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అయితే, ఇప్పుడు బాబూరావు పదే పదే కోరటంతో బాలకృష్ణ సైతం ఆయన ఇష్టం మేరకు నిర్ణయం తీసుకొనేందుకు సుముఖత వ్యక్తం చేయటంతో వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు

 

Leave a Reply