ఇక ఇవాళ్టి నుంచి అయోధ్య కేసు విచారణ

Share Icons:
కొత్త ఢిల్లీ, జనవరి 10,
వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుచేస్తామని సుప్రీంకోర్టు జనవరి 4న స్పష్టం చేసిన విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వ‌ంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూవీ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉంటారు. గురువారం నుంచి అయోధ్య కేసుపై విచారణ జరగనుంది.
అయితే, గతంలో ఈ కేసు విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుచేయడానికి నిరాకరించిన న్యాయస్థానం, తాజాగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. అయోధ్య వివాదంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలంటూ గత సెప్టెంబరు 27న విచారణ సందర్భంగా పిటిషనర్ కోరితే, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2:1 మెజార్టీతో తిరస్కరించింది. కాగా, ప్రస్తుతం ఏర్పాటుచేసిన రాజ్యాంగం ధర్మాసనంలోని మిగతా నలుగురు సభ్యులూ భవిష్యత్తుల్లో చీఫ్ జస్టిస్ పదవి రేసులో ఉన్నవారే కావడం విశేషం. జనవరి 4న అయోధ్య అంశానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్ కే కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ ప్రక్రియపై కొత్త ధర్మాసనమే నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా సుప్రీం తెలిపింది. తదుపరి విచారణను జనవరి 10కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. విచారణ చేపట్టిన కేవలం 15 సెకెన్లలోనే ముగించడం విశేషం. అయోధ్య వివాదంపై మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, రాజీవ్ ధావన్‌లు హాజరు కాగా, ఎలాంటి పత్రాలను దాఖలుచేసే అవకాశం మాత్రం ధర్మాసనం వీరికి ఇవ్వలేదు.
మామాట: చాలా కేసులుండగా.. రామాలయం అత్యవసరమా యువరానర్…. 

Leave a Reply