ఇంగ్లండ్ ని చిత్తు చేసి సెమీస్ కు చేరుకున్న ఆసీస్ ..

Share Icons:

లండన్, 26 జూన్:

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతుంది. వరుస విజయాలు సాధిస్తూ సెమీస్ కు దూసుకెళ్లింది. అటు ఇప్పటికే వెస్టెండీస్, పాకిస్థాన్ చేతిలో ఓడి సెమీస్ అవకాశాలను క్లిష్టం చేసుకున్న ఇంగ్లండ్.. మంగళవారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలై దాన్ని మరింత సంక్లిష్టం చేసుకుంది.

ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన ఇంగ్లండ్ ప్రస్తుతం 8 పాయింట్లతో ఉంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 285 పరుగులు చేసింది.

కెప్టెన్ ఆరోన్ ఫించ్ (116 బంతుల్లో 100; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా.. ఓపెనర్ వార్నర్ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. వీరిద్దరి జోరుతో ఆసీస్ భారీ స్కోరు చేయడం ఖాయమే అనిపించినా.. ఇంగ్లండ్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీసి కంగారూల జోరుని అడ్డుకున్నారు.

అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్ పేసర్లు బెరెన్‌డార్ఫ్ (5/44), స్టార్క్ (4/43) ధాటికి ఇంగ్లండ్ 44.4 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది. స్టోక్స్ (115 బంతుల్లో 89; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేయగా మిగిలిన వారిలో కనీసం ఒక్కరు కూడా 30 పరుగులు చేయలేకపోయారు. ఫించ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇక ఈరోజు వరల్డ్ కప్ లో న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

Leave a Reply