చరిత్ర తిరగరాశారు: ఆసీస్‌దే యాషెస్..!

Australia beat England in fourth Test to retain Ashes
Share Icons:

మాంచెస్టర్:

యాషెష్ సిరీస్ 19 ఏళ్ల చరిత్రని ఆస్ట్రేలియా తిరగరాసింది. ఇంగ్లండ్ గడ్డపై మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆస్ట్రేలియా యాషెష్ సిరీస్ దక్కించుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టులో 185 పరుగులతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. దీన్న్థో ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ లో ముందజ వేసింది. ఇక చివరిదైన ఐదో టెస్టులో ఆసీస్ ఓడిపోయిన సిరీస్ డ్రా అవుతుంది. డ్రా అయిన గత యాషెష్ సిరీస్ ఆస్ట్రేలియానే గెలిచింది కాబట్టి ఈసారి కూడా వారి దగ్గరే ఉండనుంది. ఇక లాస్ట్ టెస్టులో గెలిచిన, డ్రా అయిన సిరీస్ ఆసీస్ దే.

382 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ అయిదోరోజు 18/2తో మొదలుపెట్టింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి ఏ దశలోనూ లక్ష్యం దిశగా అడుగులు వేయలేకపోయింది. ఉదయం హాజెల్‌వుడ్‌, కమిన్స్‌ నిప్పులు చెరిగే బంతులను ఎదుర్కొనేందుకు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారు. అయితే రాయ్‌ రక్షణాత్మకంగా ఆడడంతో తొలి గంట వికెట్‌ కోల్పోకుండా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించింది. 31 పరుగులు చేసి కుదురుకున్నట్టు కనిపించిన రాయ్‌ను ఓ ఆఫ్‌కట్టర్‌తో కమిన్స్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇదే ఊపుతో మరో ఐదు ఓవర్ల తర్వాత మూడో టెస్ట్‌ హీరో బెన్‌ స్టోక్స్‌ (1)ను కూడా కమిన్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు.

మొత్తానికి 87/4తో ఇంగ్లండ్‌ లంచ్‌కు వెళ్లింది. విరామం తర్వాత కమిన్స్‌ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన డెన్లీ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. కానీ కొద్దిసేపటికే స్పిన్నర్‌ లియాన్‌ బౌలింగ్‌లో లబుషేన్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. ఆపై బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను బెయిర్‌స్టో కుదుట పరుస్తున్న తరుణంలో ఈసారి స్టార్క్‌ ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. ఫుల్‌లెంగ్త్‌ డెలివరీతో బెయిర్‌ స్టోను ఎల్బీడబ్ల్యూ చేశాడు. టీ విరామానికి ఇంగ్లండ్‌ ఆరు వికెట్లకు 166 పరుగులు చేసింది. టీ బ్రేక్‌ తర్వాత కొద్దిసేపటికే హాజెల్‌వుడ్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ వెంటనే ఆర్చర్‌ను లియాన్‌ పెవిలియన్‌కు చేర్చగా అనంతరం ఓవర్టన్‌ (21), లీచ్‌ (12) కొద్దిసేపు ఆస్ట్రేలియా బౌలర్లను విసిగించారు. కానీ, లీచ్‌ను లబుషేన్‌, ఓవర్టన్‌ను హాజెల్‌వుడ్‌ అవుట్‌ చేయడంతో ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగిపోయింది.

మొత్తం మీద ఇంగ్లండ్ 197 పరుగులకు చాప చుట్టేశారు. ఆసీస్ లో పేసర్లు పాట్‌ కమిన్స్‌ (4/43), హాజెల్‌వుడ్‌ (2/31) అదరగొట్టారు. ఇక డబుల్ సెంచరీతో అదరగొట్టిన స్టీవ్ స్మిత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.

 

Leave a Reply