TRENDING NOW

అడిగేవాడు ఉండకూడదా…

అడిగేవాడు ఉండకూడదా…

 

అనగా అనగా ఓ రాజు. ఆయన కొలువుదీరితే.. చుట్టూ వందమాగధులు.. పరిచారికలు, సేవకులు, చారులు, వేగులు, గూఢపుఠానీ బఠానీలు, మంత్రులు, సామంతులు, భజన బృందాలు, బట్రాజులు,, తానా తందానాగాళ్లు నిండి ఉండే వారు.. సభ సాంతం ప్రశాంతంగా జరిగినట్టు కనిపించేది. నిరసనల గళం వినిపించేది కాదు.. దీనితో సాయంత్రానికి రాజుగారు తనకు ఎదురులేదనీ, పాలన సజావుగా సాగుతోందనీ భావించుకుని, కాలువగట్టున విడిదికి వెళ్లిపోయేవారు…

 

అది  రాజరికం, అలా పాలన సాగించే వారు ఆ తరువాత ప్రజల తిరుగుబాటుకు, శత్రురాజుల దాడులకు బలైపోయిన సంఘటనలు కూడా చరిత్రలో ఉన్నాయి. కానీ మనది ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక సారి చట్టసభలకు ఎన్నికలు జరగాలి, ప్రజాక్షేత్రంలో విజయం సాధించిన వారు శాసనసభల ద్వారా పాలన సాగించాలి. మరి ఇక్కడ ప్రతిపక్షం పాత్ర ఏమిటి. నేటి నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం లేకుండా సభలు నిర్వహించాలని పాలక పక్షం భావిస్తోంది. ఇది ఎంత వరకు సమంజసం. ప్రజల గోడు పాలకులకు విన్నవించే ప్రతిపక్షానికి ఉన్నది శాసన సభావేదిక. అక్కడ కూడా ప్రతిపక్షం గొంతునొక్కివేసే చర్యలు కొనసాగుతున్నాయి. మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధంకావడం లేదు. వైసీపీ అడుగుతున్నదేమిటి.. ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ పార్టీని వీడి అధికార పక్షంలో చేరి మంత్రులుగా , పాలక పక్షంగా ఛలామణీ అవుతున్నవారి పై చర్యలు తీసుకోమనే కదా.. ఇందుకు గౌరవ సభాపతికి ఎంతకాలం కావాలి? ఎన్ని సంవత్సరాల సమయం అవసరమౌతుంది? సభ్యులంతా సభకు రండి అని ఆహ్వానించిన సభాపతి, అందుకు అవసరమైన పరిస్థితిని కల్పించాలి కదా, ఇపుడు బంతి ఎవరి కోర్టులో ఉంది. సభాపతి వద్దే ఉంది, మరి వారు చర్యలు తీసుకోకుండా సభ ఎలా సజావుగా సాగుతుంది.

ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసనసభ్యుడు  తరువాత తన పార్టీకి కాకుండా వేరే పార్టీకి విధేయత చూపినట్టు ఆధారాలున్న మరుక్షణం అలాంటి శాసన సభ్యుడిని అనర్హుడుగా ప్రకటించాలని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టం చేస్తోంది. మరి స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఇవన్నీ తెలియ వనుకుంటున్నారా..! పైగా ఇది వరకు జరిగిన 11 సమావేశాలలో సభలో అడిగిన 792 ప్రశ్నలకు ఇంత వరకూ మంత్రుల నుంచి సమాధానం రాలేదు. కొత్తగా మళ్లీ ప్రశ్నలు అడగడం వలన ప్రయోజనం ఉంటుందా?

ఒక వ్యక్తి వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి, ఎం.ఎల్.ఏ గా గెలిచి, తరువాత స్వంత కారణాలతో పార్టీ ఫిరాయించి పాలకపక్షంలో చేరిపోయారు. అందుకు నజరానాగా వారికి మంత్రి పదవి కూడా వచ్చింది. అటువంటి మంత్రి.. ప్రతిపక్షం వైయస్ ఆర్ సీపీ అడిగే ప్రశ్నలకు చిత్తశుద్దితో సమాధానం ఇస్తారని ఎలా ఆశించగలం. అందువలన సభలో ప్రశ్నలు అడిగి మాత్రం సాధించేదేమిటి, కాగితాలపై సమస్యలు రాసి, సభాపతి కార్యాలయానికి పంపడం కాకపోతే.. అవి పరిష్కారానికి నోచుకోనప్పుడు వ్రతమూ చెడి ఫలితమూ దక్కని పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ఒంటెద్దు పోకడలను ప్రజలు హర్షిస్తారా. సభా నిర్వహణలో పాలక పార్టీకి ఉండవలసని సహృదయత లేకపోతే ప్రజాసమస్యలకు వేదిక ఏది?

 

మామాట:  ఇది నక్కా, కొంగ విందు కథ లాగా ఉంది కదా… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: