వింటర్ వేడి: జగన్ వర్సెస్ చంద్రబాబు

Share Icons:

అమరావతి: ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్ హాట్ గా జరుగుతున్నాయి. సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.  కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం మీడియాకు సంబంధించి జారీ చేసిన జీవో 2430 గురించి వాడి వేడి చర్చ జరిగింది. ఈ సమయంలో టీడీపీ సభకు వచ్చే ముందు నిరసన చేపట్టింది. ఆ తరువాత సభలో దీని గురించి ప్రస్తావించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఆ జీవోలో ఎటువంటి తప్పు లేదన్నారు. మీరు ఏది రాసినా భరించాలా అని ప్రశ్నించారు. జీవో ఇంగ్లీషులో ఉండటంతో చంద్రబాబుకు అర్దం కాలేదేమో అని ఎద్దేవా చేసారు. దీనికి చంద్రబాబు సైతం స్పందించారు. తనకు ఇంగ్లీషు రాదని సీఎం చులకనగా మాట్లాడుతున్నారని..అదే విధంగా అసెంబ్లీలో పులివెందుల పంచాయితీ సరి కాదని హెచ్చరించారు.

వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పత్రికా స్వేచ్చకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని..ఈ జీవో పైన జాతీయ మీడియాలో వ్యతిరేకంగా కధనాలు వచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. ఇక అంతకముందు అసెంబ్లీ బయట టీడీపీ నేతలు మార్షల్స్ తో గొడవ పడిన వీడియోని అసెంబ్లీలో ప్లే చేసి చూపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు…జగన్ ని ఓ ఉన్మాది అంటూ మాట్లాడారు. దీనిపై జగన్ మాట్లాడుతూ… సభలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెబుతారని అనుకోవడం లేదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తనను ‘ఉన్మాది’ అని సంబోధించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. తాను జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేయడంపై జగన్ స్పందించారు.

ఏ మాత్రం మానవత్వం లేని వ్యక్తి, నోరు జారి ఆ తరవాత మన్నించాలని కోరుతారని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరితో సభా సమయం వృథా అవుతోందని మండిపడ్డారు. అసెంబ్లీని కాపాడే మార్షల్స్ ను రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడారని జగన్ అసెంబ్లీకి తెలిపారు.

ఆ సమయంలో స్పీకర్ తమ్మినేని కల్పించుకుని, నేడు సభలో జరిగిన ఘటనలను, సభ బయట జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను తెప్పించుకుని పరిశీలిస్తానని అన్నారు. వాస్తవాలను తెలుసుకుంటానని, ఆపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు. క్షమాపణలు చెప్పేందుకు చంద్రబాబునాయుడు నిరాకరించిన నేపథ్యంలో, నిజానిజాలను తెలుసుకున్న తరువాత ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటానని అన్నారు.

 

Leave a Reply