బంగ్లా టాప్ లేపుతారా?

asia cup: India vs bangladesh
Share Icons:

దుబాయి, 21 సెప్టెంబర్:

సంచలనాలకు నెలవుగా మారిన ఆసియా కప్‌లో టాప్ 4 సమరానికి తెర లేచింది. ఈ టాప్ 4లో ఇండియా, పాకిస్థాన్ జట్లు చోటు దక్కించుకోగా, వీటితో పాటు ఎవరు ఊహించని విధంగా శ్రీలంకని టోర్నీ నుండి బయటకి పంపించి బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్‌లు కూడా స్థానం దక్కించుకున్నాయి.

ఈ నేపథ్యంలోనే నేడు సూపర్‌ ఫోర్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను ఢీకొననుండగా, పసికూన అఫ్గానిస్తాన్ పాకిస్థాన్‌తో తలపడనుంది.

అయితే టోర్నీ రికార్డు, ఆటగాళ్ల పరంగా చూస్తే ఈ మ్యాచ్‌లో రోహిత్‌సేన ఫేవరెట్. కానీ సంచలనాలకు మారు పేరుగా నిలుస్తున్న బంగ్లా మొండిగా పోరాడటంలో దిట్ట. కాబట్టి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి. కానీ  బంగ్లాదేశ్‌కు పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. గురువారం అబుదాబిలో అప్ఘన్‌తో మ్యాచ్ ఆడిన బంగ్లా.. ఈ మ్యాచ్ కోసం దుబాయ్‌కు ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోయే ప్రమాదం ఉన్నది.

ఇక మరోవైపు టైటిల్ ఫేవరెట్‌గా దిగిన భారత్‌ను ఈసారి గాయాల బెడద పీడిస్తున్నది. వెన్ను నొప్పికి గురైన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. అలాగే పాక్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఎడమ చేతి చూపుడు వేలి గాయానికి గురైన అక్షర్ పటేల్, హాంకాంగ్ మ్యాచ్ తర్వాత నడుం నొప్పి, గజ్జల్లో గాయంతో బాధపడ్డ శార్దూల్ ఠాకూర్ కూడా టోర్నీ నుంచి వైదొలిగారు. దీంతో ఈ ముగ్గురి స్థానాల్లో దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, సిద్ధార్థ్ కౌల్‌ను బీసీసీఐ గురువారమే దుబాయ్‌కు పంపించింది. అయితే ఈ త్రయంలో ఎవరు తుది జట్టులో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

అయితే వరుసగా రెండు మ్యాచ్‌లు ఆడటంతో.. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నది. ఇదే జరిగితే బుమ్రాకు తోడుగా ఖలీల్ అహ్మద్ తుది జట్టులోకి రావొచ్చు.

బౌలింగ్ ఆల్‌రౌండర్ కాకుండా మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలని భావిస్తే మాత్రం మనీష్ పాండేను తీసుకోవచ్చు. ఎలాగూ పాండ్యా బౌలింగ్ లోటును కేదార్ జాదవ్ తీరుస్తున్నాడు కాబట్టి బ్యాటింగ్ లోతుపైనే రోహిత్ ఎక్కువగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్, ధవన్ గాడిలో పడటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇక మిడిలార్డర్ బాధ్యతలు మోస్తున్న రాయుడు, కార్తీక్ తామెంటో పాక్‌పై నిరూపించుకున్నారు. కాబట్టి వీళ్లను మార్చే అవకాశాల్లేవు. అయితే మాజీ కెప్టెన్ ధోనీని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దించాలనే దానిపైనే కసరత్తులు చేస్తున్నారు.

మరి చూడాలి వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్ బంగ్లా టాప్‌ లేపుతుందో లేదో?

మామాట: బంగ్లాని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు…

Leave a Reply