Ashok Singh నాకు పెద్దన్న లాంటివారు.. కోచ్ మరణం పట్ల లక్ష్మణ్ భావోద్వేగం

Share Icons:
దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు కోచ్‌గా వ్యవహరించిన అశోక్‌ సింగ్‌ (64) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. 1998లో దగ్గర శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన లక్ష్మణ్.. తర్వాత అజారుద్దీన్, సచిన్ తదితర కెప్టెన్ల సారథ్యంలోని భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేంత వరకు లక్ష్మణ్‌కు అశోక్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం.

అశోక్ సింగ్ మరణ వార్త తెలియగానే లక్ష్మణ్ భావోద్వాగానికి లోనయ్యారు. అశోక్ మరణం తనకు తీరని లోటని.. ఆయనకు తనకు కెప్టెన్ మాత్రమే కాకుండా పెద్దన్న లాంటి వారని లక్ష్మణ్ తెలిపారు. ఆట పట్ల ఎంతో అంకితభావం, మక్కువ ఉన్న అశోక్.. తనకు ఎప్పుడూ ప్రేరణ కలిగించే వాడని.. తాను మరింత మెరుగ్గా ఆడేలా చూశాడని లక్ష్మణ్ తెలిపారు. నిన్నెంతో మిస్సవుతా అశోక్ భాయ్.. నీ ఆత్మకు శాంతి కలగాలి అని ట్వీట్ చేశారు.

లక్ష్మణ్‌తోపాటు భారత క్రికెటర్, ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు కూడా అశోక్ కోచ్‌గా వ్యవహరించారు. న్యూస్ ఏజెన్సీ పీటీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రెయిన్ క్యాన్సర్ కారణంగా అశోక్‌కు గతేడాది సర్జరీ నిర్వహించినట్లు తెలుస్తోంది. సర్జరీ పూర్తయిన తర్వాత 14 నెలలు అశోక్ జీవించగలిగారు. అనేక మంది ఆటగాళ్లకు 30 ఏళ్లుగా కోచింగ్ ఇచ్చిన అశోక్.. అప్పట్లో రంజీ ట్రోఫీకి ఎంపికైనా.. మ్యాచ్‌లో బరిలో దిగలేకపోయారు.