అనారోగ్యంతో అరుణ్ జైట్లీ మృతి…సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు..

Arun Jaitley passes away at AIIMS Delhi
Share Icons:

ఢిల్లీ:

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్, మూత్రపిండాల రుగ్మతలతో బాధపడ్డ ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. జైట్లీ మరణవార్తను ఎయిమ్స్ మీడియా, ప్రొటోకాల్ విభాగం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు మధ్యాహ్నం 12.07 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని వెల్లడించింది. ఈనెల 9వ తేదీని జైట్లీ ఎయిమ్స్ లో అడ్మిట్ అయ్యారని… సీనియర్ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించిందని తెలిపింది.

ఇక అరుణ్ మృతి పట్ల బీజేపీ నేతలు కన్నీరు పర్యంతమవుతుండగా, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జైట్లీతో తనకు పరిచయం ఉండటాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పారు.

అరుణ్ జైట్లీ కన్నుమూసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలియజేశారు. జైట్లీ కుటుంబానికి, ఆయన అనుయాయులకు తన సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ప్రజాజీవితంపైనా, మేధావి వర్గంపైనా అపార ప్రభావం చూపుతుందని కోవింద్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అరుణ్ జైట్లీ మరణం దేశానికి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, తనకున్న అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. ఇక అరుణ్ మృతి పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఓ కుటుంబ సభ్యుడ్ని కోల్పోయినంత బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, టీడీపీ అధినేత చంద్రబాబు కుద్ అరుణ్ జైట్లీ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.

 

Leave a Reply