అరవిందమహర్షి
మానవులు పుడతారు, మరణిస్తారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణంగా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. కోటాను కోట్ల జనంలో బహు కొద్దిమంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు. ప్రపంచం లో ప్రతి జాతిలోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు. జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అరబిందో- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గంలో ప్రయాణించేందుకుకృషి చేద్దాం. ఆయన జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లదొరల పాలననుంచి విముక్తి కలిగి దేశమాత దాస్య సృంఖలాలు తెగిపోయాయి. మమకు స్వాతంత్ర్యం లభించింది.
అరబిందో(అరవిందో) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయ వాది, యోగి, మరియు గురువు. ఆధ్యాత్మిక సాధనవల్ల అత్యుత్తమ స్థాయికి ఎదిగిన మహనీయుల్లో శ్రీ అరవిందో ఒకరు. అరబిందో ఆగస్టు 15, 1872 న కోల్కతా లో జన్మించాడు. ఈయన పూర్తి పేరు అరబిందో ఘోష్. అరవింద అనగా బెంగాలీలో పద్మము అని అర్థం. తల్లి స్వర్ణ లతాదేవి. తండ్రి కె.డి.ఘోష్. తండ్రి వైద్యుడు. బ్రిటన్ లో ఉండి అబెర్దీన్ విశ్వ విద్యాలయంలో వైద్యవిద్య నభ్యసించారు.
అరబిందో అద్భుతమైన మేధాశక్తి తో గ్రీక్, లాటిన్ వంటి విదేశీ భాషలలో ప్రావీణ్యం సాధించారు. ఐ.సి.యస్. మొదటి స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లిష్ లో అద్భుత పావీణ్యం సంపాదించారు. అరబిందో తొలుత రాజకీయాల పట్ల అమితాసక్తి ప్రదర్శించారు. క్రమేపీ రాజకీయం నుంచి ఆధ్యాత్మికత వైపుకు మళ్ళారు. మొదటగా వడోదరలో మహారాష్ట్ర యోగియైన విష్ణు భాస్కర్ లెలె ఉపదేశంతో ఆధ్యాత్మికత వైపుకు ఆకర్షితుడైనాడు. రెండవసారి కోల్కతాలోని ఆలీపూర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నపుడు ఆధ్యాత్మికత పట్ల గాఢమైన ఆసక్తి కలిగింది. ఇక్కడ ఆయన చేసిన భగవద్గీత పారాయణం, అనుసరణ ఆయనకు అనేక ఆధ్యాత్మిక అనుభూతుల్ని కలిగించాయి.
పుదుచ్చేరిలో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవైనాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించారు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవారు. ప్రపంచాన్ని సత్యమార్గంలో నడిపించేందుకు యోగ సాధనలో చరిత్ర సృష్టించిన భగవాన్ శ్రీ అరవింద శ్రీ అన్నై పవిత్ర సమాధి తమిళనాడులోని పుదుచ్చేరిలో వెలసి ఉండటం ఎంతో భాగ్యమని ఆధ్యాత్మిక పెద్దలంటూ ఉంటున్నారు. ఆధ్యాత్మికమార్గంలో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలను ఒకే త్రాటిపై నడిపించే తరహాలో ఎన్నో శుభకార్యాలు శ్రీ అరవిందర్, అన్నై ఆశీస్సులతో జరిగాయని, ఒక మారు పుదుచ్చేరికి వెళ్లి వస్తే.. జీవితాలు మలుపులు కలుగుతాయని ఆధ్యాత్మిక గురువులు అంటుంటారు.
అలాగే శ్రీ అన్నై మాతను స్మరించుకుని ఎలాంటి కార్యాన్నైనా ప్రారంభించేవారికి ఆటంకాలుండవని భక్తుల విశ్వాసం. అలాగే జీవిత సుఖసంతోషాలు కలుగజేసే ఆ దేవదేవుని లీలలెన్నో ఉన్నాయని పుదుచ్చేరి అన్నై అరబిందో ఆశ్రమ స్థల పురాణాలు చెబుతున్నాయి. భగవానుని లక్ష్యాన్ని మానవరూపం ధరించి (అరబిందోగా) పరమాత్ముని లక్ష్యాన్ని నెరవేర్చేందుకు జన్మించి, పుదుచ్చేరి ఆశ్రమంలో జీవించారని ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు. ప్రపంచ అభివృద్ధి కోసం అరబిందో స్వామి సేవలందించిన సంస్థల్లో పుదుచ్చేరి అరబిందో ఆశ్రమం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేగాకుండా అరవింద భగవానుడు రాసిన లైఫ్డివైన్, సింథసిస్ ఆఫ్ యోగా, సావిత్రి అన్నై రాసిన మధర్ అజెండాలతో పాటు పలు ఆధ్మాత్మిక రచనలు మానవమాత్రుని జీవితానికి ఎంతగానో సహకరిస్తున్నాయి. అలాగే మానవాభివృద్ధికి అవసరమైన దైవ, ఆధ్యాత్మిక సూచనలు అందిస్తున్నాయి. అటువంటి మహనీయుని ఆధ్యాత్మిక మార్గంలో మానవుడు పయనించేందుకు వీలుగా అరబిందో మహాత్ముని ఉపదేశాలు, ఆధ్యాత్మిక సూచనలు దేశంలోనే గాకుండా.. ప్రపంచవ్యాప్తంగా గల ప్రజలకు మార్గదర్శకం వహిస్తాయి. ఆ మహాపురుషుడు 1950 డిసెంబరు 5న దేహం చాలించారు. ఆయన ధర్మపత్ని మృణాళిని.
-నందిరాజు రాధాకృష్ణ