నిరుద్యోగ భృతిపై మీన మేషాలు

Share Icons:

విజయవాడ, 11 సెప్టెంబర్:  

తెలుగుదేశం ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే… రాష్ట్రంలోని యువతరం అందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ అప్పట్లో ఎన్నికల మేనిఫెస్టోలో చాలా ఘనంగా ప్రకటించింది. చాలా చాలా కీలకమైన హామీల మాదిరిగానే ఈ విషయాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత.. పక్కన పెట్టి కన్వీనియెంట్ గా మరచిపోయింది.

ఒకవైపు అలాంటి ప్రమాణాన్ని నమ్మి, చంద్రబాబుకు అధికారం అప్పగించిన నిరుద్యోగ యువతరంలో అసంతృప్తి జ్వాలలు  రేగుతుండగా… మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని కూడా లేవనెత్తుతూ పాదయాత్ర ప్రారంభించేసరికి ప్రభుత్వం కొంత అప్రమత్తం అయింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో, ఆయన తమ లోపాలను ఎత్తిచూపితే యువతరం ప్రభావితం అవుతారనే భయంతో.. తెలుగుదేశం ముందుగానే నిరుద్యోగ భృతి గురించి కొన్ని ప్రకటనలు గుప్పించింది.

మంత్రి నారాలోకేష్ ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతోందని.. వచ్చే సంక్రాంతి నుంచి (అంటే 2018 సంక్రాంతి) భృతి అందజేస్తాం అని ప్రకటించారు. అప్పటినుంచి రోజులు గడుస్తున్నాయే తప్ప నిర్ణయం మాత్రం రాలేదు. మరోవైపు జగన్ అంతకుమించిన హామీలను కూడా నిరుద్యోగ యువతరానికి ఇచ్చేసుకుంటూ పాదయాత్రలో సాగిపోతున్నారు.

ఇదిలా ఉండగా.. సంక్రాంతి నాటికి చేతికందుతుందనుకున్న భృతి.. 2018 దసరా వస్తున్న నాటికి కూడా అందేలా లేదు. ఇప్పుడు ఈ భృతికి దరఖాస్తు చేసుకోవడం గురించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అప్లయి చేసుకుంటే.. ఆ దరఖాస్తుల్ని వడపోసి.. ఆ తర్వాత ఎప్పటికో తుదిజాబితాలను సిద్ధంచేసి.. ఆ తర్వాత అందిస్తారు. ఇదంతా జరిగేలోగా.. 2019 సంక్రాంతి కూడా వచ్చేసినా ఆశ్చర్యం లేదని యువత పెదవి విరుస్తున్నారు.

అచ్చంగా ఎన్నికల ముందు.. ఓట్ల కోసం బిస్కెట్ వేసినట్లుగా చంద్రబాబు సర్కార్ ఈ పథకాన్ని అమల్లోకి తెస్తుందని వారు భావిస్తున్నారు.ఇన్నాళ్లూ వ్యవహారాన్ని నాన్చిన ప్రభుత్వం ఇప్పుడు 10లక్షల మందిని అర్హులుగా ఎంపికచేసినట్లు తేల్చింది. పోనీ తేల్చారు కదా, ఇచ్చేస్తారా అంటే అది కూడా లేదు. మళ్లీ సదరు అర్హులు 14వ తేదీ నుంచి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ ప్రక్రియలో వారు అనర్హులుగా తేలినా ఆశ్చర్యంలేదు. అంటే ఈ 10 లక్షలు అనే సంఖ్య ఇంకా తగ్గవచ్చు కూడా! ఇలా రకరకాల మాయోపాయాలతో విసిగి వేసారిన యువత… నిరుద్యోగ భృతి కోసం చూడడం కంటే ఆశ చంపుకోవడం బెటర్ అనుకునే వాతావరణాన్ని సర్కారు సృష్టిస్తోంది మరి!

మామాట: ఇంకెంతకాలం ఎదురుచూడాలో మరి…

Leave a Reply