శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా తప్పించుకునేందుకే ఢిల్లీ సాకు…

Share Icons:

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీడీపీ సెటైర్లు వేశారు. అసలు జగన్ అపాయింట్‌మెంట్‌ లేకుండా ఢిల్లీ ఎందుకెళ్లారని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రజాధనంతో ఢిల్లీ వెళ్లి ఏం సాధించారని, వ్యక్తిగత విషయం మాట్లాటేందుకు వెళ్లారు కాబట్టే.. జగన్‌కు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదన్నారు. శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఏదో ఒక సాకుతో దాట వేస్తున్నారని విమర్శించారు.

సామాన్యులకో న్యాయం, సీఎంకు ఒక న్యాయమా? అంటూ ఆయన ప్రశ్నించారు. జగన్ కేసుపై విచారణ జరగాలని.. నిజాలు బయటికి రావాలని డిమాండ్ చేశారు. జగన్ నిర్దోషి అయితే విచారణ తర్వాత తలపైకెత్తి తిరగొచ్చునని వర్లరామయ్య వ్యాఖ్యానించారు. మరోవైపు అభివృద్ధికి బదులుగా రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. అభివృద్ధి చేయడం చేతకాకపోతే చెప్పండి, మేం చేసి చూపిస్తాం అంటూ వ్యాఖ్యానించారు.

జగన్ ఢిల్లీ వెళ్లింది ఎందుకు… అభివృద్ధి కోసమేనా? లేక సొంత పనుల నిమిత్తం అమిత్ షా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లారా? అని ప్రశ్నించారు. స్వకార్యాల కోసం ప్రభుత్వం డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని నాని ఆరోపించారు. కాగా, ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరైన కేశినేని నాని ఇటీవల జరిగిన ఆంధ్రజ్యోతి జర్నలిస్టు హత్య విషయాన్ని లోక్ సభలో లేవనెత్తారు. దీనికి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ బదులిస్తూ, ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా స్వీకరించి దర్యాప్తు షురూ చేసిందని లిఖితపూర్వకంగా తెలియజేశారు. అంతేకాకుండా, మరణించిన జర్నలిస్టు కుటుంబానికి జర్నలిస్టు సంక్షేమ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు.

అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజధాని అమరావతిలో పర్యటించగా, ఆయన కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు స్పందించారు. రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాడి చేయించింది ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశారు. విపక్షాలపై కక్షసాధింపు చర్యలు పక్కనబెట్టి, సీఎం రాష్ట్రపాలనపై దృష్టి సారిస్తే మంచిదని హితవు పలికారు.

అయినా, ప్రతిపక్ష నేతపై దాడి చేసిన వారిని వదిలేసి, బస్సును సీజ్ చేయడమేంటని నిలదీశారు. దర్యాప్తు పేరుతో తొమ్మిదిరోజుల పాటు బస్సును వారి అధీనంలో ఉంచుకుని, బస్సు యాజమాన్యాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. ఇప్పటికైనా బస్సును యజమానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ రాశారు.

 

Leave a Reply