జగన్ పాలనపై స్పీకర్ ప్రశంసలు…టీడీపీ నేతల విమర్శలు…

CM YS Jagan Mohan Reddy to address CRDA meeting on Amaravati capital
Share Icons:

అమరావతి:

సీఎం జగన్ అధికార పీఠం అధిరోహించి 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం జగన్ పై ప్రశంసల జల్లు కురిపించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తమ్మినేని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, మంత్రి కొడాలి నాని సహా పలువురు నేతలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్ తన 100 రోజుల పాలనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్ ‘నేను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా’ అని ప్రజల ముందుకు వచ్చారని ప్రశంసించారు.

ఇక జగన్ మోహన్ రెడ్డి, రాజశేఖరెడ్డి ఉన్నప్పుడు వర్షం రాదంటే వార్త అవుతుంది. వర్షం వస్తే అసలు అది వార్తే కాదు. వరుణదేవుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. నేనీ మాట చెప్పకూడదు కానీ. కరవు-చంద్రబాబు నాయుడు కవల పిల్లలు. వరుణుడు-వైఎస్సార్ కుటుంబం బాంధవ్యంతో కూడుకున్న వ్యక్తులు. ఈరోజు వర్షం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి నా ప్రసంగాన్ని ముగిస్తున్నా జైహింద్.. జై జగన్’ అంటూ తమ్మినేని సెలవు తీసుకున్నారు.

అటు జగన్ పాలన పై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతి తరలిస్తారన్న వ్యాఖ్యలపై జేసీ స్పందిస్తూ, ‘రాజధాని ఇక్కడే ఉంటుంది, మా వాడు అంత తెలివి తక్కువ వాడు కాదు’ అని అన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా తమ వాడేనని చెప్పిన జేసీ, జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనకు వందకు వంద పడాల్సిందేనని అన్నారు.

ఇక టీడీపీ నేతలు దేవినేని ఉమా, ఎంపీ గల్లా జయదేవ్ లు జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపారో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ 100 రోజుల పాలన అంతా తప్పుల తడకేనని విమర్శించారు. సొంతవారికి దోచిపెట్టేందుకే కొత్త ఇసుక విధానాన్ని తీసుకొచ్చారని అన్నారు. ప్రజలపై మరింత భారం మోపే విధంగా ప్రభుత్వ తీరు ఉందని చెప్పారు.

సాధారణంగా ఏ ప్రభుత్వమైనా తొలి 100 రోజుల్లో మిగతా ఐదేళ్ల పాటు చేపట్టబోయే అభివృద్ధి కోసం అజెండాను నిర్దేశించుకుంటుందని గల్లా జయదేవ్ తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాన్ని ముందుకు కాకుండా తిరోగమనం దిశగా తీసుకెళుతోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వం ఏమాత్రం దార్శనికత లేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు.

 

Leave a Reply