విశాఖకు సచివాలయ ఉద్యోగులు….మే 31 లోపే…

Share Icons:

అమరావతి: ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నికలపై రచ్చ జరుగుతున్న నేపథ్యంలో, మరోవైపు విశాఖ తరలివెళ్లేందుకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి తమ నిర్ణయాన్ని చెప్పేందుకు వీలుగా ఈరోజు సచివాలయ ఉద్యోగులు భేటీ అవుతున్నారు. ఇందులో విశాఖ రాజధానిపై తమ నిర్ణయాన్ని వారు ప్రకటిస్తారు.

ఏపీ కొత్త రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లే విషయంలో ప్రభుత్వం తమ ముందు పెట్టిన ప్రతిపాదనలను చర్చించి తుది నిర్ణయం ప్రకటించడానికి ఇవాళ సచివాలయ ఉద్యోగులు సమావేశమవుతున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేస్తూనే విశాఖ వెళ్లేందుకు సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని లేదా ప్రతిపాదన వాయిదా వేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది.

విశాఖకు తరలించేందుకు ఏదో ఒక గడువు ఉండాలని ముందునుంచీ కోరుతున్న ఉద్యోగులు ఇకనైనా డెడ్ లైన్ విధించాలని పట్టుబట్టనున్నారు. జూన్ మొదటి వారంలో విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో మే నెలాఖరులోపు మొత్తం తరలింపు ప్రక్రియ పూర్తి కావాలని ఉద్యోగులు కోరనున్నారు. అంటే ఏప్రిల్ నెలలోనే తరలింపు ప్రారంభం అయితే కానీ మే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో మే నెలాఖరును డెడ్ లైన్ గా పెట్టాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరబోతున్నారు.

ఉద్యోగులు కోరుతున్న విధంగా మే నెలాఖరులోపు విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియ పూర్తి కావాలంటే కచ్చితంగా ఏప్రిల్ మొదటి వారంలోనే ఇది మొదలవ్వాలి. అలా కాకుండా ఏప్రిల్ చివరినాటికి ప్రారంభమైనా చిక్కులు తప్పవు. అలా నెలరోజుల్లో తరలింపు పూర్తి చేయడం కూడా ప్రభుత్వానికి పెనుసవాలుగా మారిపోతుంది. ఓవైపు రాజధాని బిల్లుల వ్యవహారం మండలిలో పెండింగ్, మరోవైపు మండలి రద్దు బిల్లు పార్లమెంటులో పెండింగ్, కర్నూలుకు ఇప్పటికే తరలించిన కార్యాలయాల వ్యవహారం ఏపీ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అతి తక్కువ సమయంలో ఈ ప్రక్రియ ఎలా పూర్తి చేస్తుందనేది అర్ధం కాకుండా ఉంది.

 

Leave a Reply