బీజేపీలోకి టీడీపీ నేత….వైసీపీలోకి జనసేన నేత?

war words between tdp,ysrcp and bjp leaders in ap
Share Icons:

అమరావతి:

ఆంధ్రప్రదేశ్ లో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీని ముఖ్య నేతలంతా వీడుతున్నారు. ఇప్పటికే చాలా మంది పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. అలాగే కొందరు వైసీపీలో చేరారు. ఇక మరికొందరు టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి బీజేపీలోకి వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది.

2015లో టీడీపీ తీర్థం పుచ్చుకున్న వాకాటి 2017లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆర్థిక నేరారోపణలతో 2018 జనవరిలో ఆయన్ను సీబీఐ అరెస్టు చేసి బెంగళూరు పరసన అగ్రహారం జైలులో రిమాండ్‌ విధించింది. అప్పుడే టీడీపీ వాకాటిని సస్పెండ్ చేసింది. ఇక అప్పటినుంచి జైల్లో ఉన్న వాకాటికి గత నెల 30వ తేదీ సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 31వ తేదీన బెయిల్‌పై విడుదల అయిన ఆయన స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే వాకాటి రాజకీయ భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే మూడు రోజుల నుంచి వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఆయన్ను కలుస్తుండటంతో పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది. అయితే ఆయన బీజేపీలో చేరతారంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పటికే తెలంగాణాకు చెందిన కేంద్రమంత్రితోపాటు ఆ పార్టీ నేతలతో వాకాటి సంప్రదింపులు జరిపారంటూ వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీలోకి బాలరాజు?

జనసేన నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైసీపీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే మాజీ మంత్రి వైసీపీలో చేరనున్నారని, ఆయన చేరికను ముఖ్యమంత్రి జగన్‌ కూడా స్వాగతించారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదిలా ఉండగా ఈ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా బాలరాజు సన్నిహితులు, కార్యకర్తలతో పార్టీ మారుతున్నట్టు పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టు సమాచారం.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. , ప్రజలకు ఉపయోగపడే పథకాలను జగన్‌ అమలులోకి తీసుకొచ్చారన్నారు. మద్యపాన నిషేదం చాల మంచి నిర్ణయమన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిణామలన్నీ చూస్తుంటే బాలరాజు వైసీపీలోకి జంప్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది.

Leave a Reply