వైసీపీలో ముదిరిన వర్గపోరు: జగన్ క్లాస్ తీసుకోవాల్సిందేనా?

Share Icons:

అమరావతి: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కాలేదు…కానీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుంది. ఈ ప్రభుత్వం ఏర్పడిన ఈ కొద్ది రోజుల్లోనే పలువురు నేతల మధ్యవర్గపోరు బహిరంగంగానే నడుస్తోంది. మొదట ఈ వర్గపోరుకు గుంటూరు జిల్లాకు చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ లు నాంది పలికారు. బాపట్ల ఎంపీ అయిన సురేశ్ తన నియోజకవర్గంలో పనులు విషయంలో కలుగజేసుకోవడంతో ఎమ్మెల్యే శ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇసుక విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పైగా ఓ  కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీ విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య గొడవ జరిగి కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది.

అటు చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజని, సీనియర్ నేత మర్రి రాజశేఖర్ ల మధ్య అధికరంలోకి వచ్చిన మొదట్లోనే రచ్చ మొదలైంది. జగన్ మాటతో పోటీకి వెనక్కి తగ్గిన మర్రి…ఎన్నికల్లో విడదల గెలుపు కోసం కృషి చేశారు. కానీ గెలిచాక విడదల, మర్రిని పక్కనబెట్టేసింది. పైగా నియోజకవర్గంలో ఫుల్ డామినేట్ చేస్తోంది. దీంతో నియోజకవర్గంలో మర్రి వర్గం సెపరేట్ అయిపోయింది. అసలు ఈ రెండు వర్గాలకు అసలు పడటం లేదు.

ఇక ఇటీవల శ్రీదేవి, విడదల రజనిల మధ్య వివాదం చెలరేగింది.  తాడికొండ నియోజకవర్గంలో ఓ మసీదు నిర్మాణ కార్యక్రమంలో రజనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో శ్రీదేవికి మండింది. రజని అనుచరుల హడావిడిని తప్పుబడుతూ…ఏంటీ ఈ రచ్చ అంటూ రజని మొహం మీద అనేసి కార్యక్రమం మధ్యలో నుంచి వెళ్లిపోయింది. పైగా తాజాగా రజని సొంత పార్టీ నేతల మీదే తీవ్ర ఆరోపణలు చేసింది. సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లనైన తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని అన్నారు. తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడవాలనుకుంటున్నవారి అంతు చూస్తానని హెచ్చరించారు.

అటు గుంటూర్ వెస్ట్ లో చంద్రగిరి యేసురత్నం, లేళ్ళ అప్పిరెడ్డిలకు పడటం లేదు. ఇక ఆధిపత్య పోరు కర్నూలు జిల్లాలో కూడా ఉంది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఇన్ చార్జ్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి, ఎమ్మెల్యే ఆర్థర్ లకు అసలు పొసగడం లేదు. కింది స్థాయిలో మొదలైన పంచాయితీలు హత్యా యత్నాల వరకు వెళ్లడంతో స్థానిక వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇక ఈ పంచాయతీ ప్రస్తుతం జగన్ వద్దకు చేరడంతో జగన్ ఏం చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. మరి జగన్ ఈ వర్గపోరుల విషయంలో నేతలకు గట్టి క్లాస్ పీకితేనే కొంచెం పార్టీకి మంచి జరిగేలా ఉంది.

Leave a Reply