ఎన్నికలు రీషెడ్యూల్‌కు ప్రతిపక్షాలు డిమాండ్…

tdp president chandrababu sensational comments on boston consultancy
Share Icons:

అమరావతి: కరోనా ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు త్వరగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం గవర్నర్, సుప్రీం కోర్టుకు వెళ్లింది. కానీ అక్కడ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి నిర్వహించాలనే డిమాండ్‌ను టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు తెరపైకి తీసుకొచ్చారు. ఆ పార్టీల ప్రతినిధులు గురువారం అమరావతిలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశమయ్యారు. ఏపీలో మొదటినుంచి ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని వివిధ పార్టీల నేతలు కోరారు. తమ ప్రతిపాదనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు మీడియాకు తెలిపారు.

కరోనా వైరస్ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలను ఎస్ఈసీ రమేశ్ కుమార్ వాయిదా వేయడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల వాయిదాను అధికార వైసీపీ వ్యతిరేకించగా.. విపక్షాలు స్వాగతించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలే ముఖ్యమని విమర్శించిన సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ల పర్వం సరిగా జరగలేదని.. మళ్లీ మొదటినుంచి ఎన్నికలను నిర్వహించాలని టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ కోరుతున్నాయి. అందులో భాగంగా గురువారం గవర్నర్‌తో సమావేశమయ్యారు.

వైరస్ దృష్ట్యా ఎన్నికలను 6 వారాలపాటు ఎస్ఈసీ వాయిదా వేశారు. అయితే ఇప్పటివరకు ఏకగ్రీవమైన వారికి అనుమతిస్తామని.. ఎన్నికలను మాత్రమే వాయిదా వేస్తున్నట్టు పేర్కొనడంతో.. మళ్లీ మొదటినుంచి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని విపక్ష నేతలు గవర్నర్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని మాజీమంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయా చోట్ల విపక్ష అభ్యర్థుల నామినేషన్లను లాక్కున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో పోలీసులు చేతులేత్తెశారని.. సీఆర్పీఎఫ్ బలగాల నీడన ఎన్నికలు నిర్వహించాలని కోరారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టేలా వ్యవహరించారని సీపీఐ నేత రామకృష్ణ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ఆయా కేంద్రాల వద్దకు పంపించారని తెలిపారు. తమ పార్టీ నేతలతో బెదిరింపులకు గురిచేసి ఎన్నికలు నిర్వహించాలని జగన్ అనుకొన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

 

Leave a Reply