చంద్రబాబు మాకు అతిదరిద్రమైన ఆర్థికస్థితిని వారసత్వంగా ఇచ్చారు..

ap minister buggana rajendranath reddy fires on chandrababu
Share Icons:

అమరావతి: ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఆనాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి అతిదరిద్రమైన ఆర్థికస్థితిని వారసత్వంగా ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే గత ప్రభుత్వ పాలసీ వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే ఇసుక కష్టాలు తీరతాయని అన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తన హామీలన్నీ నెరవేర్చారని, చెప్పినదాని కంటే ముందుగానే తమ ప్రభుత్వం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. రైతులకు సున్నావడ్డీ రుణాలు, ఇన్యూరెన్స్‌ ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం జగన్‌ హామీలన్నీ నెరవేరుస్తుంటే చంద్రబాబు ఓర్వలేక తన ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల అనుభవం అంటూ చంద్రబాబు ఏం మాట్లాడతారో ఆయనకే అర్థంకావడం లేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసిందని, అప్పులు చేసి.. వాటిని మాపై నెట్టి విమర్శిస్తున్నారని, విద్యుత్‌ డిస్కంలను నష్టాల్లోకి నెట్టారని మండిపడ్డారు. ‘ఇండియా ఇండెక్స్ సర్వేలో రాష్ట్రాల పరిస్థితులపై నివేదిక ఇచ్చారని, కొత్తదనం, వినూత్న ఆవిష్కార పరిస్థితులపై సర్వే చేశారని చెప్పారు. ఇలా మొదటి సారి ర్యాంక్ ఇచ్చినప్పుడు ఇక పడిపోవడం అనే విషయం ఎక్కడుంటుందని, మన రాష్ట్రంలో ఉన్న పరిజ్ఞానం అమలు చేసే విధానం లో వెనుకబడి ఉన్నామని చెప్పారు. పరిశ్రమకు మారే విషయంలో వెనుకబడ్డామని పేర్కొన్నారు. అసలు ఈ పరిస్థితికి చంద్రబాబు పాలన కారణం కాదా..?’ అని బుగ్గన ప్రశ్నించారు.

అటు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ ​కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా విరుచుకుపడ్డారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలతో జతకట్టి తన దరిద్రాన్ని అందరికీ అంటించాడని ఎద్దేవా చేశారు. ‘ఒక వ్యక్తి తన ‘టచ్‌’ మహిమతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కోలుకోకుండా చేశారు. తన దరిద్రాన్ని అందరికి అంటించి వచ్చారు. వచ్చే జనవరిలో ఢిల్లీ, 2021 మేలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు ఉన్నాయి. వాటి ఫలితాలెలా ఉంటాయో మనం ఊహించవచ్చు. తనేమో బిజెపీ ‘క్షమాభిక్ష’ కోసం ఎదురు చూస్తున్నాడు’  అంటూ చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

Leave a Reply