రాజధాని విషయంలో బొత్స మరో సంచలన ప్రకటన….చంద్రబాబుపై విమర్శలు

botsa satyanarayana comments on ap capital
Share Icons:

అమరావతి:

ఏపీ రాజధాని అమరావతి విషయంలో గత కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కొందరు రాజధాని మారిబోతుందంటే, మరికొందరు మారదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అమరావతిపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే అని చంద్రబాబు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిందా? అని బొత్స ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించాలని బొత్స డిమాండ్ చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు మీడియా మిత్రులు కూడా చూడలేదన్నారు. అర్ధరాత్రి పారిపోయి రాష్ట్రానికి వచ్చి అడ్రస్ లేకుండా చేసిన చంద్రబాబు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఇక ‘ఏరకంగా అయితే తాత్కాలిక ప్రభుత్వం అని ఇన్నేళ్లు చంద్రబాబు బతికాడో, అమరావతిని కూడా అదే రీతిలో తాత్కాలికంగా ఉంచావ్. అంతేకానీ రాజధాని అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రశ్నించారు.

ఒకవేళ జరిగినట్లు చంద్రబాబు చెబితే నేను కరెక్ట్ చేసుకుంటాను. అసలు రాజధానిపై గెజిటే విడుదల చేయకుండా అసలు నీకు(చంద్రబాబుకు) మాట్లాడే హక్కు ఉందా? ప్రజలు ఐదేళ్లు పాలించమని తీర్పు ఇస్తే ఎంజాయ్ చేశావ్. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టావ్. చంద్రాబాబే చెప్పాడు కదా.. కట్టిన బిల్డింగులు తాత్కాలికమని. ఏ ముఖం పెట్టుకుని ఏం పుస్తకం రిలీజ్ చేస్తాడు? చిన్నవయసులోనే వైఎస్ స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజారంజక పరిపాలన అందిస్తుంటే, నువ్వా(చంద్రబాబు) విమర్శించేది?

మీరా మాకు నీతులు చెప్పేది? పెట్టుబడిదారులు వెళ్లిపోతున్నారంట. ఎక్కడికి పోతారండీ పెట్టుబడిదారులు. నీలాంటి వాడి పాలన ఉంది కాబట్టే ఇన్నాళ్లూ పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారు. ఎవరూ పర్మినెంట్ గా ఈ రాష్ట్రానికి రాలేదు. అందుకే ఇవాళ మీడియా ద్వారా గత 100 రోజుల్లో జరిగిన పరిపాలనను వివరిస్తున్నాం. జగన్ మా అన్న,తమ్ముడు, కుటుంబ సభ్యుడు అని ప్రతీ పేదవాడు అనుకునేలా మేం పరిపాలన అందిస్తాం’ అని బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఇక అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పరిపాలన తుగ్లక్ 2.0లా సాగిందని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించిన సంగతి తెలిసిందే. దీనిపైన కూడా మంత్రి స్పందించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి అర్ధరాత్రి మూటాముల్లె సర్దుకుని పారిపోయి వచ్చినవాడే అసలైన తుగ్లక్ అని బొత్స విమర్శించారు. అలా పారిపోయింది లోకేశ్ తండ్రి చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. దిగవంత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ రాష్ట్రం విడిపోకూడదని పోరాడారనీ, అదే సమయంలో లోకేశ్ నాయన మాత్రం ‘రాష్ట్ర విభజనకు మేం సుముఖం’ అని పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారని దుయ్యబట్టారు.

 

Leave a Reply