జగన్ తీసుకున్న ఆ నిర్ణయం తెలంగాణకు కలిసొచ్చిందా….!

new jobs in ap wine shops
Share Icons:

హైదరాబాద్:

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా నవరత్నాలని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే నవరత్నాల్లో భాగంగా ఉన్న మద్యపాన నిషేదాన్ని కూడా దశలవారీగా అమలపరిచేందుకు జగన్ ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమలుకు నిర్ణయించి విధివిధానాలు ఖరారు కూడా చేసింది. అయితే దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4,380 మద్యం షాపులు ఉండగా 3,500 మద్యం షాపులను ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ద్వారా నిర్వహించనుంది.

అయితే ఏపీలో మద్యం షాపులన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవనున్నాయి. దీంతో ఏళ్ల తరబడి ఏపీలో మద్యం వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తున్నారు. వైన్ షాప్స్ నిర్వహించే వారు తెలంగాణలో వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో తమ వ్యాపారాన్ని సాగించేందుకు నడుం కడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణాలో మద్యం షాపుల ప్రారంభానికి దరఖాస్తుదారులు లక్ష రూపాయల రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

తాజాగా ఏపీ వ్యాపారులు తెలంగాణాలో వ్యాపారం నిర్వహించడానికి సిద్ధం కావడంతో ఇక్కడి ప్రభుత్వం ఈ అప్లికేషన్ ఫీజును ఏకంగా రెట్టింపు.. అంటే రెండు లక్షలు చేసినట్టు సమాచారం . ఇప్పటికే లక్ష రూపాయల రుసుముతో ఖజానాకు 300 కోట్లకు పైగా లాభం చేకూరినట్టు చెబుతున్నారు. సాధారణంగా అక్టోబరు నుంచి తెలంగాణాలో కొత్త ఎక్సయిజు పాలసీ ప్రారంభమవుతుంది. అందువల్ల మరో రెండు నెలల్లోగా ఏపీ కాంట్రాక్టర్లు, ఇక్కడ తమ ‘ మద్యం వాపారాన్ని ‘ విస్తరించేందుకు పావులు కదుపుతున్నారని, రెండు లక్షలు కాదు.. మూడు లక్షల ఫీజయినా చెల్లించేందుకు సుముఖంగా ఉన్నారని తెలిసింది. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం మద్యం షాపులని స్వయంగా నిర్వహించడంతో తెలంగాణలో మద్యం బిజినెస్ కు డిమాండ్ పెరగనుంది.

కాగా, ఏపీ కొత్త మద్యం పాలసీలో భాగంగా ఈ ఏడాది 3,500 మద్యం దుకాణాలు నిర్వహించనున్న సర్కార్.. ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల్లో 880 షాపులకు కోత విధించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో షాపుల నిర్వహిస్తారు. 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో షాపును ఏర్పాటు చేయనున్నారు. అలాగే మద్యం దుకాణాలకు స్థలాన్ని బేవరేజెస్ కార్పొరేషన్ గుర్తిస్తుంది.

 

Leave a Reply